Telugu Global
Arts & Literature

అతీతురాలు (కథానిక )

అతీతురాలు   (కథానిక )
X

భగవంతుడా, ఆరోగ్యం ఇయ్యకుండా ఆయుష్షు ఎందుకు ఇచ్చవయ్యా?" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది డెభై తొమ్మిదేళ్ళ లక్ష్మమ్మ, కూతురు సుగుణ మంచం దగ్గర కూర్చుని.

పాలుపట్టి, ఉగ్గుపోసి పెంచి పెద్ద చేసిన చేతులతో.. మృత్యువుకు దగ్గరగా వెళుతున్న కూతురుకి

పగలస్తమానం జావలు, గంజీ, పాలకూర ఉడికించిన నీళ్లు, సగ్గుబియ్యం గంజి తయ్యరుచేసి లెక్క ప్రకారం కూతురుకి పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటోంది లక్ష్మమ్మ.

వార్ధక్యంతో వంగిన నడుము పనికి సహకరించటంలేదు. కూతురు శరీరం ముద్దలా జారిపోతుంటే, లేపి బాత్రూం దాకా తీసుకు వెళ్ళే ఓపిక లేక, ఆ బట్టలని మెల్లిగా తీసి ఉతుకుతూ.. ఎన్నాళ్ళు భగవంతుడా నా కూతురుకి ఈ బాధలు అనుకొని వచ్చే ఏడుపుని మింగుకుంటోంది.

కూతురుతో సేవలు చేయించుకొని, కూతురు చేతిమీదగా వెళ్ళవలసిన తల్లి బాధతో మూలుగుతున్న కూతురుని చూడలేక, అపురూపంగా గుండెల మీద పెట్టుకొని పెంచిన మనవడు తల్లి కోసం తపన పడుతుంటే..రేపో ఎల్లుండో పోయే కూతురు, త్వరగా పోవాలని కోరుకోకతప్పటంలేదు లక్ష్మమ్మకు.

సుగుణ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించటంలేదు. కూతురు లేచి తిరగగలదనే ఆశ లేదు. వైద్యానికి డబ్బులేదు. ఇప్పటికే తెచ్చిన అప్పులు లక్షల్లో ఉన్నాయి. డిగ్రీ చదివిన మనవడు మెడికల్ దుకాణంలో పనిచేసి తెచ్చే పది వేలు, ఏమూలకీ రావటంలేదు. సుగుణ చేసే అటెండర్ ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఆరునెలనించీ జీతం కూడా రావటంలేదు.

చిన్నతనంలో భర్తను పోగొట్టకున్న లక్ష్మమ్మ, మాటలు రాని కూతురు మీదే ప్రాణాలు పెట్టుకుని పెంచింది. చక్కని రూపం కలిగిన సుగుణను తమ్ముడుకి నచ్చచెప్పి ఒప్పించి, తమ్ముడుతో పెళ్ళిచేసింది. వాళ్ళ నీడలో సేదతీరుతూ.. మనవల ఆటపాటలతో సంతోషంగా ఉందేది లక్ష్మమ్మ.

అదేం తలరాతో మరి, కూతురు సుగుణ కూడా తల్లిల్లానే చిన్న వయసులో, విధవరాలయింది. తమ్ముడు స్థానంలో, కూతురుకి ఉద్యోగం రావటంతో..కూతురు పసుపు కుంకుమలు చెరిగినా, జీవితానికి ఒక స్థిరత్వం కలిగినందుకు కొంచం ఊరట కలిగింది లక్ష్మమ్మకు. సుగుణ ఉద్యోగానికి వెళితే, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. మనవరాలికి చుట్టాలలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు.

సుగుణ కొడుకు కిరణ్‌కు చదువు పూర్తి అయింది. గవర్నమెంటు ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ నాలుగేళ్ళు దాటింది. ఎక్కడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించక, మెడికల్ స్టోరులో పనిచేస్తున్నాడు. కొంతలో రోజులు ప్రశాంతంగానే గడుస్తుండేవి.

సుగుణకు అస్తమానం ఎడమ వైపు నడుము దగ్గర విపరీతమైన నొప్పివస్తూంటే, గ్యాస్‌ నొప్పేమో అనుకొని, గ్యాస్ కోసం వంటింటి చిట్కాలు వాడేరు కొన్నాళ్ళు. తగ్గే సూచనలు ఎక్కడా కనిపించక, బాధ ఎక్కువ అయ్యేసరికి... లక్ష్మమ్మ కూతురుని తీసుకొని హాస్పటలుకి వెళ్ళింది.

పరీక్షలన్నీ అయ్యేక... డాక్టర్ చెప్పిన మాటకు, ఆశ్చర్యంతో కూడిన భయానికి లోనైంది లక్ష్మమ్మ. సుగుణకు కిడ్నీ ఒక్కటే ఉందట. ఒక్కదాని మీద ఒత్తిడి ఎక్కువై పనిచేయటం లేదని...

"మీకు ఇన్నాళ్ళూ తెలియలేదా? తెలిసే ఊరుకున్నారా?" అని డాక్టర్స్ తిడుతుంటే..

"మాకు ఎలా తెలుస్తుంది బాబూ? ఎప్పుడూ ఇలాంటి నొప్పి రాలేదు అమ్మాయికి. పురుళ్లు రెండూ నార్మలుగానే అయ్యేయి. మునపటి కాలం, పురుళ్లకి ఇన్ని టెస్టులు చేసేవారు కాదు" అని ఏడుస్తూ కూతురుని ఎలాగైనా బాగు చేయమని డాక్టర్ల కాళ్ళు పట్టుకొని వేడుకొంది. లక్ష్మమ్మ తన ప్రయత్న లోపం లేకుండా...కూతురు ఆరోగ్యం కోసమని, దాచుకున్న డబ్బు, బంగారం అంతా ఖర్చుపెట్టింది.

డాక్టర్స్ తమవంతు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మమ్మ తాహతుకి మించి డబ్బు అప్పుచేసి మరీ ఖర్చు పెడుతోంది. అలా రెండు సంవత్సరాలు దాటింది. ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం కనిపించటం లేదు. ఒకరోజు పెద్ద డాక్టరుగారు పిలిచి...

"లాభం లేదమ్మా. ఇంక నెలో, వారమో, రోజులో చెప్పలేము, నీకూతురు పరిస్థితి" అన్న పెద్ద డాక్టరు మాటలకు కుళ్ళి కుళ్ళి ఏడ్చిందా తల్లి.

అందరికీ మంచికీ చెడుకీ సలహాలు ఇచ్చి, ధైర్యం చెప్పే లక్ష్మమ్మకు..తన కుటుంబానికి వచ్చిన ఇంతపెద్ద ఆపదను ఎలా తట్టుకోవాలో అర్థంకావడం లేదు.

సుగుణకోసం తనతోపాటు బెంగపెట్టుకుంటూ, తన ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చే మనవడు కిరణుని చూస్తుంటే.. విరక్తి కలుగుతోంది. కిరణ్ వయసు దరిదాపు ముఫైకి చేరుకుంటోంది. ఈ పాటికి పెళ్ళయితే తండ్రి అయి ఉండేవాడే. సరైన సంపాదనలేక, పెళ్ళి ఊసు ఎత్తుకోలేదు ఇన్నాళ్ళూ. వీడి తల్లి ఆఖరు రోజుల్లో ఉంది. పోనీలే అదిపోతే దాని జాగాలో వీడికి ఉద్యోగం వస్తుంది. తల్లి, వీడికి పోతూ పోతూ ఉపకారం చేసి పోతుందా? పోనీలే, అలా జరిగితే నాకు వీడి గురించి బెంగ ఉండదు అనుకొంది లక్ష్మమ్మ.

సుగుణ రిటైర్మెంటుకి ఇంకా నాలుగు నెలలు ఉంది. ఈ లోగా సుగుణ పోతే ఆ ఉద్యోగం కిరణుకి వస్తుంది, మనవడి జీవితం చక్కపడుతుందనే ఆశతో కూతురు చావుకోసం ఎదురు చూస్తోంది లక్ష్మమ్మ. రిటైర్మెంటులో వచ్చిన డబ్బుతో...ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పు కొంత తీరుతుంది. మిగతావి కిరణ్ తీర్చుకుంటాడు.

కూతురు చావు ఆలోచనల నించీ బయటకు వచ్చి, కన్నీళ్లు తుడుచుకొని, ఛ, ఏంటీ ఇలా ఆలోచిస్తున్నాను? అది నా కన్న పేగు. నేను ఎందుకింత నిర్దయగా ఆలోచిస్తున్నాను అని బాధపడింది లక్ష్మమ్మ.

ప్రతీ నిమిషం, ప్రతి ఘడియ, కూతురు శరీరాన్ని పట్టుకొని స్పర్శిస్తూ, ఒకొక్క రోజూ గడుస్తోంది. ఒకొక్క సారయితే ఈ మొండి పిల్ల ఇంత బాధని ఎలా తట్టుకుంటోంది? అని కూడా విలపించిందా తల్లి.

సుగుణ రిటైర్మెంట్ రోజు వచ్చింది. కాగితాలను ఇంటికి పంపించేరు. లక్ష్మమ్మకి ఏడుపు రావటంలేదు. గొంతు మూగపోయిందో, లేక కళ్ళల్లో నీరు నిండుకుందో తెలీదు. ఇలాంటి దుస్థితి చూడటానికే బతికి ఉన్నానా? అని ఎన్నిసార్లు అనుకుందో లక్ష్మమ్మ. కూతురు చావు కోరుకున్నాను అనే పశ్చాత్తాపం లక్ష్మమ్మ మనసులో వేధిస్తోంది. ఎండిన పుల్లలాంటి కూతురు చెయ్యి పట్టుకు ఒక్కనిమిషం కూడా వదలటం లేదు...ఇలాంటి రోజులు చూడటానికే నేను బతికి ఉన్నానా? వృద్ధాప్యం నాకెందుకు ఇంత భయంకరంగా ఉంది.

తల్లిని చూడటానికి సుగుణ కూతురు రాణీ వచ్చింది. రాణి ఎప్పుడు వచ్చినా, ఆపిల్లని కిరణ్ స్టేషనుకి వెళ్లి తేవాలి. రాణికి ఇద్దరూ చిన్నపిల్లలు వాళ్ళ అవసరాలు చూడాలి. ఈ పనులన్నీ కిరణ్ నెత్తిమీద పడుతుంటే లక్ష్మమ్మ బాధపడేది. కిరణ్ పొద్దున్న తొమ్మిదికి డ్యూటీకి పోతే రాత్రి తొమ్మిది దాకా రాడు. రాణీ అవసరాలన్నీ తీరుస్తూ కిరణ్, తను అలిసిపోతుంటే.. సుగుణకు సదుపాయం జరగటం లేదని రాణీని...

"ఎప్పుడైనా రామ్మ. అస్తమానం వస్తె, నేను చాకిరీ చెయ్యలేను" అని చెప్పేది మనవరాలికి లక్ష్మమ్మ. ఈ సారి మాత్రం రాణినిచూసి లక్ష్మమ్మ వదనం ప్రసన్నంగానే ఉంది.

రాత్రి, మనవలిద్దరినీ దగ్గరకు పిలిచి, మౌనంగా ఇద్దరినీ దగ్గరకు తీసుకొంది. ఎన్నో జాగ్రత్తలు చెప్పాలనుకుంది, మనవలకు. లక్ష్మమ్మకు గొంతు పెగిలి ఒక్కమాట బయటకు రాకపోయినా, అమ్మమ్మ స్పర్శలో ఊరట చెందేరు ఇద్దరూ.

లక్ష్మమ్మరోజూ లాగే కూతురు పక్కనే మరొక మంచంమీద పడకకు సిద్ధమై..

"డబ్బులు వచ్చేయి కదా తల్లీ, రేపు మంచి హాస్పటలుకి వెళదాము. నీకు తగ్గుతుందమ్మా. లేచి తిరుగుతావే" అని కూతురుకి ధైర్యం చెప్పింది.

పేలవంగా నవ్వుతున్న కూతురుని చూస్తుంటే, మనసు మూలుగుతోంది. కూతురు దీనావస్థను చూడటానికే నేను బతికి ఉన్నానా? అని దుఃఖిస్తూ కూతురు తలమీద చెయ్యి వేసుకొని పడుకుంది లక్ష్మమ్మ. ఆ రాత్రే ఆఖరు రాత్రి అయింది లక్ష్మమ్మకు. అందరికీ సలహాలు ఇచ్చే ఆమె, తన కూతురు కుటుంబం ఎలా చక్కదిద్దుకోవాలో అర్థంకాక, నిశ్చలంగా తెలివి రాని నిద్రలోకి వెళ్ళిపోయింది. కూతురు జీవితం ఎలా ఒడ్డెక్కుతుంది? మనవడు ఒంటరిగా ఎలా బతుకుతాడు? అనే చింతలన్నీ వదిలి, అన్ని బెంగలకూ అతీతురాలై అనంతలోకాలకు వెళ్ళిపోయింది లక్ష్మమ్మ ముసలి ప్రాణం.

- విజయలక్ష్మి

First Published:  23 Sep 2023 6:35 AM GMT
Next Story