Telugu Global
Arts & Literature

ప్రముఖ కథా రచయిత..కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత

కేతు విశ్వనాథరెడ్డి అస్తమయం తెలుగు సాహిత్యప్రపంచానికి తీరనిలోటు

ప్రముఖ కథా రచయిత..కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత
X

1939 జూలై 10 న ప్రస్తుతపు వైఎస్సార్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయి పురంలో జన్మించిన ప్రముఖ కథారచయిత,విమర్శకులు ,విద్యావేత్త ,అరసం పూర్వ అధ్యక్షులు, ఇటీవలి అధ్యక్షవర్గ సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు ఇవాళ 2023 ,మే 22 సోమవారం ఉదయం కాసేపటిక్రితం కన్ను మూశారు.

వారి శ్రీమతికి ఆరోగ్యం బాగాలేదని ఒంగోలులో ఉన్న వారి కుమార్తె దగ్గరికి శనివారం తీసుకొని వెళ్ళారు. నిన్నంతా ఆమెకు వైద్యపరీక్షలు చేయించారు. ఆ రిపోర్టులు ఇవాళ వస్తాయన్నారట.

ఈరోజు ఉదయం అయిదు గంటలకు విశ్వనాథరెడ్డి గారికే గుండెనొప్పి వచ్చికాసేపటికే కన్ను మూశారు

వాన కురిస్తే, తేడా, అమ్మవారి నవ్వు, కూలిన బురుజు , నమ్ముకున్న నేల ,మరో దెయ్యాల కథ వంటి వందకథలు, బోధి, వేర్లు వంటి నివలికలు రచించారు.

" కడప ఊళ్ళ పేర్లు" అనే అంశం మీద పరిశోధించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికోసం కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యాన్ని వస్తుపరంగా వింగడించి, అద్భుతమైన సంపాదకీయాలు రచించారు.

ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షులుగా ఉండేవారు ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. "ఈభూమి" పత్రికకు సంపాదకులు గా పనిచేసారు పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశారు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించారుపాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు .పాఠ్యప్రణాళికలను రూపొందించారు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చారు

జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించారు ,

ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వారి వేర్లు నవల రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల.

కేతు విశ్వనాథరెడ్డి అస్తమయం తెలుగు సాహిత్యప్రపంచానికి తీరనిలోటు

First Published:  22 May 2023 7:31 AM GMT
Next Story