Telugu Global
Arts & Literature

అన్ లాక్డౌన్

రైతు ఉద్యమాల నేపథ్యం, అయోధ్య రామాలయ చందాలు, విశాఖ ఉక్కు, టెలికామ్, ఎల్లైసీ ల ప్రైవేటు పరం చేసే ప్రయత్నాల గురించిన కవిత - 7/2/2021 న వ్రాసినది

అన్ లాక్డౌన్
X

ఒక ఉక్కు హక్కు

ముక్కలయ్యేందుకు

సిద్ధం చేస్తున్నారు ...

అర్థరాత్రి, అపరాహ్నం అని ఆపసోపాలు పడకుండా

అన్నాలు, అపరాలు, అన్నీ పండించే అన్నదాతలు

ఒకరికొకరై కదం తొక్కుతూ కదనరంగం లో దూకి

కళ్ళకి కూడా కాయలు కాయిస్తూ ...

ఇనపముళ్ళూ,

తుపాకి గుళ్ళూ

చూసి పుట్టింట పరాయిదైపోయిన అమ్మవారిలా ...

ఆగ్రహిస్తున్నారు ...

చుట్టాలకోసం చేసిన చట్టాలంటూ ఘోషిసున్నా

ప్రజాస్వామ్యపు ప్రాథమిక ప్రవచనాలైన ప్రతివాదాలూ, ప్రబోధాల ప్రక్రియలూ,

చర్చోపచర్చల ప్రతిక్రియలూ

పక్కకెళ్ళిపోయాయ్ ...

వాళ్ళు తగ్గుతారని వీళ్ళూ,

వీళ్ళు తలొగ్గుతారని వాళ్ళూ

మంకు పట్టుదలలకి పోతూ ఉంటే ...

పరిష్కార మార్గాలు

మూసుకుపోయి ప్రతిష్టంభన కి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు

పగుళ్ళుబడ్డాయ్ ...

ఇంతలో మందిరాలకి చందాలిచ్చి మరీ ఉక్కు సంకల్పానికి సాలిడారిటీ తెల్పిన సందోహానికి ముక్కు పగిలేలా ప్రతిపాదనలు ముందుకొచ్చాయ్

ఫలానా ఆఫీసు దో... ఒకావిడదో ... మరో ఆయనదో నూటతొంభయ్యేడు కొట్టి ఫోన్ నెంబరిడిగే దశనుంచీ

ట్రూకాలర్ ద్వారానో, మరో జాసూసీ మార్గం లోనో నెంబర్లు 'కొనుక్కునే' పద్ధతికి

దారిచ్చి...

టెలిఫోన్ డిపార్ట్మెంటు అడ్రసే గల్లంతయ్యే స్థితికొస్తే ...

టచ్ స్క్రీన్లో సెల్ఫీ మోడ్ ఒత్తి

మన దేభ్యం మొహం మనమే చూస్కోవాల్సిన దుస్థితిలో పడ్డాం ...

పొగాకు నుంచీ పంచనక్షత్ర పూటకూళ్ళ పంచల వరకూ విస్తరించిన ఐటీసీ మొదలు

భారీ నిర్మాణాల ఎల్లెండ్ టీ వరకూ

అన్నిట్లో పెట్టుబడులు పెట్టిన ప్రజా బీమా సంస్థ ధీమా ప్రశ్నార్థకమైపోయింది

రేపో, మాపో ...

పోలీసాయనా , ప్రైమ్మినిస్టరాఫీసూ

ప్రైవేటు పరమైతే ...

లాక్డౌన్ ప్రసాదాల

పవరు ముందు

మనగోడు వినేదెవ్వరు ??

జిందగీ కే సాథ్ భీ

జిందగీ కె బాద్ భీ

- సాయి శేఖర్

First Published:  7 Feb 2023 4:35 AM GMT
Next Story