Telugu Global
Arts & Literature

పోస్త్యుమస్అవార్డ్

2020 లో ఆర్మీ డే సందర్భంగా వ్రాసినది

పోస్త్యుమస్అవార్డ్
X

మనిషి మరణించాక

మరిచిపోయిన మంచినంతా

మూటగట్టి మూలధనం దానం చేసినంత ముచ్చటగా ... మూర్తీభవించిన మానవతతో మిగిలినోళ్ళ కళ్ళు తుడిచి

గౌరవ పురస్సరంగా

ప్రదానం చేసే పురస్కారమే

ఈ ఎవార్డ్

అదే ... బతికున్నప్పుడంతా

పెద్ద బూరెల గంప ఆ మనిషి వచ్చి పడటం కోసమే ఎదురుచూస్తున్నట్టూ

ఆ మనిషి తినబోయే రొట్టె

ఏదో ఒకనాడు విరిగి నేతిలో పడే అవకాశమున్నట్టూ ...

కోతలు కోసి, శ్రమ దోపిడీ చేసి అప్పుడప్పుడూ కుక్క బిస్కెట్ల లాంటి పనికిమాలిన తాయిలాలిచ్చి తైతక్కలాడించడం

ఒక ప్రాక్టికల్ క్రూడ్ జోక్

మేషాండ భ్రమే అని తెలిసినా

ఆశ గా ఎదురు చూడటం మానవుడి లోని నక్క నైజం

పాపం ఆ ఆశల పల్లకిలో

డోలలాడుతూ భవిష్యత్తు లో ఎపుడో భోగభాగ్యాలతో తులతూగుతానని కలల్లో ఓలలాడుతూ ... ఇవ్వాళ మరణించడానిక్కూడా సిద్ధపడ్డ సైనికుడూ, కార్మికుడూ, మానధనుడూ, అభిమానధనుడూ ...

ఆ జానెడో, బానెడో పొట్టకోసం పడే ఆరాటం, చేసే పోరాటం

ఆ మరణానంతర మర్యాదల కోసమేనా ?

కాకపోవచ్చు...

అవమానాలని దిగమింగి "అయ్య గారి" అవాకులకి చవాకులకీ కేవలం బతుకుతెరువు కోసం జైకొట్టేవాడు ఆర్డర్లీ అయినా ...ఆఫీసరైనా

అది హృదయపూర్వకం కాదు

హి ఈజ్ ఎ హంగ్రీ హార్స్

డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్

టు విన్ ద రేస్ ...

ప్లేజ్ ఫీడ్ హిమ్ ...

ఆశలని ఆదరించు

అనుభవాన్ని అక్కునచేర్చుకో అవసరానికి ఆధారమవ్వు

ఆత్మగౌరవాన్ని అభినందించు

అవమానించడాన్ని విసర్జించు

లేకుంటే

ఆ రక్షకుడే భక్షకుడయ్యే ప్రమాదముంది

సైనికుడుదీ ఉద్యోగమే

ఊడిగం కాదు

నీ పరువూ, నీ దేశ గౌరవం నిలబెట్టడానికి ముందు నిలబడే బలశాలిని బలహీనుడనుకుంటే

నీ తలబరువుకే బలైపోతావ్

ఆ త్యాగమూర్తి పెట్టిన శాపాలకి తగలడిపోతావ్

పదోన్నతైనా, పతకమైనా

పైసలైనా, పరమవీరచక్ర అయినా ...

పదుగురికీ చెప్పుకునే లా ఉసురున్నప్పుడే ఇచ్చెయ్

పోయాక ఇచ్చే పోస్త్యుమస్ ఎవార్డులు ఆర్చవూ, తీర్చవూ

ఆత్మలకు శాంతినివ్వవు

- సాయి శేఖర్

First Published:  15 Jan 2023 3:59 PM GMT
Next Story