Telugu Global
Andhra Pradesh

జీరో ప్లస్ జీరో అయ్యేది జీరోనే.. పవన్, లోకేష్ పై అంబటి సెటైర్

రాజమండ్రి జైలు వద్ద హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయారు. టీడీపీ -జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాల గురించే పట్టించుకోలేదు.

జీరో ప్లస్ జీరో అయ్యేది జీరోనే.. పవన్, లోకేష్ పై అంబటి సెటైర్
X

టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు గురించి ప్రకటన చేసిన తర్వాత తొలిసారి నిన్న రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఒక జీరో మరొక జీరో కలిసినా అయ్యేది జీరోనేనని విమర్శించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం ఆరు శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి మళ్లీ టీడీపీతో కలిసి వెళ్లాలని ప్రయత్నించింది. టీడీపీ కూడా గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితం కావడంతో జనసేనను మళ్లీ దగ్గర చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది.

ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకే ఈ రెండు పార్టీలు మళ్లీ దగ్గరయ్యాయి. జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానంతో మాట్లాడి టీడీపీని కూడా తమతో కలుపుకొని వెళ్తామని పవన్ కళ్యాణ్ పలుసార్లు వ్యాఖ్యానించారు.

అయితే సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మరి చంద్రబాబును కలిశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే తమ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసి పోటీ చేస్తాయని, ఇకపై రాజకీయ కార్యక్రమాలు ఉమ్మడిగా నిర్వహిస్తామని పవన్, లోకేష్ ప్రకటించారు. త్వరలోనే టీడీపీ, జనసేన సమన్వయ కమిటీని ఏర్పాటుచేసి రాజకీయంగా ముందుకు వెళ్తామని ప్రకటించారు.

అయితే రాజమండ్రి జైలు వద్ద హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయారు. టీడీపీ -జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాల గురించే పట్టించుకోలేదు. రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టలేదు. నెలన్నర రోజుల తర్వాత నిన్న రాజమండ్రిలో టీడీపీ -జనసేన సమన్వయ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్, లోకేష్ సహా ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఈ భేటీపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. జీరో ప్లస్ జీరో అయ్యేది జీరోనేనని పవన్, లోకేష్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్ట‌ర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'రాజమండ్రి లో పాత కలయికకు కొత్త రూపం! 0+0 =0 ! నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  24 Oct 2023 3:59 AM GMT
Next Story