Telugu Global
Andhra Pradesh

గాజువాకపై వైవీ ఫోకస్.. శాంతించిన తిప్పల కుటుంబం

వైవీ సుబ్బారెడ్డి మంత్రాంగం ఫలించింది. ప్రస్తుతానికి గాజువాకలో తిప్పల కుటుంబం జగన్ తోనే ఉంటామని స్పష్టం చేసింది. అయితే ఎన్నికలయ్యే వరకు ఈ విధేయత ఉంటుందని అనుకోలేం.

గాజువాకపై వైవీ ఫోకస్.. శాంతించిన తిప్పల కుటుంబం
X

వైఎస్సార్సీపీలో నిన్న రెండు రాజీనామాలు కలవరం సృష్టించాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం వెనక్కు తగ్గలేదు. గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు, నిన్నటి వరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్న దేవన్ రెడ్డి కాస్త మెత్తబడ్డారు. అసలు తాను పార్టీకి రాజీనామాయే చేయలేదని చెబుతున్నారాయన. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో తండ్రీకొడుకులిద్దరూ భేటీ అయ్యారు. తాము జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.

2019 ఎన్నికల్లో గాజువాకలో పవన్ కల్యాణ్ ని ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఈసారి తన తనయుడు దేవన్ రెడ్డిని పోటీకి దించాలని అనుకున్నారు. అధిష్టానం కూడా దేవన్ రెడ్డికి కోఆర్డినేటర్ పదవి ఇచ్చింది. అయితే ఎన్నికలు దగ్గరకొస్తున్న ఈ సమయంలో దేవన్ రెడ్డి ఈసారి గట్టిపోటీ కాదని అనుకున్న అధిష్టానం.. కోఆర్డినేటర్ ని మార్చాలనుకుంది. ఈ విషయం తెలియగానే దేవన్ రెడ్డి రాజీనామా అంటూ వార్తలొచ్చాయి. కాస్త హడావిడి నడిచింది. అధిష్టానం పిలిచి మాట్లాడుతుందేమోనని అనుకున్నారు దేవన్ రెడ్డి. కానీ సడన్ గా గాజువాక కోఆర్డినేటర్ గా వరికూటి రామచంద్రరావుని ప్రకటించడంతో సీన్ రివర్స్ అయింది. ఈరోజు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి.. ఇద్దరూ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. పార్టీకి తాము దూరం కావడంలేదని క్లారిటీ ఇచ్చారు. తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.

మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి మంత్రాంగం ఫలించింది. ప్రస్తుతానికి గాజువాకలో తిప్పల కుటుంబం జగన్ తోనే ఉంటామని స్పష్టం చేసింది. అయితే ఎన్నికలయ్యే వరకు ఈ విధేయత ఉంటుందని అనుకోలేం. అలాగని వారిని శంకించడానికి కూడా అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పదవులతో వారిని సంతృప్తి పరిస్తే గాజువాకలో వైసీపీ గెలుపుకి కూడా వారే కృషిచేస్తారు. పట్టించుకోకపోతే మాత్రం లెక్కల్లో తేడాలొస్తాయి.

First Published:  12 Dec 2023 9:07 AM GMT
Next Story