Telugu Global
Andhra Pradesh

ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీదే అధికారం - వైవీ సుబ్బారెడ్డి

ఒకరిద్దరు నాయకులు పార్టీ మారడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీదే అధికారం - వైవీ సుబ్బారెడ్డి
X

ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీకి మరింత బలం చేకూర్చుతాయని చెప్పారు. సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైతే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో వారికి వైసీపీని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని యాత్రలు, డ్రామాలు చేసినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.

సీట్ల సర్దుబాటు అందువల్లే

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను సీఎం జగన్ మార్చుతున్న సంగతి తెలిసిందే. కొందరికి మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తుండగా.. మరికొందరికి పొరుగు నియోజకవర్గాలను కేటాయిస్తున్నారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. బీసీలకు సీట్లు ఇవ్వడం వల్లే కొన్ని సీట్లను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఒకరిద్దరు నాయకులు పార్టీ మారడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టికెట్ల కేటాయింపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తాము సమాధానం చెప్పవలసిన అవసరం లేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను మాత్రమే తాము నిర్వర్తిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

First Published:  3 Jan 2024 12:33 PM GMT
Next Story