Telugu Global
Andhra Pradesh

మళ్లీ తెరపైకి ఉమ్మడి రాజధాని.. ఏపీ రాజకీయాల్లో వైవీ వ్యాఖ్యల కలకలం

జగన్ ఆమోదం లేనిదే వైవీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనుకోలేం. అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైసీపీ కొత్త ఆలోచనతో జనం ముందుకొచ్చేలా ఉంది.

మళ్లీ తెరపైకి ఉమ్మడి రాజధాని.. ఏపీ రాజకీయాల్లో వైవీ వ్యాఖ్యల కలకలం
X

ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొంతకాలం కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఉమ్మడి రాజధాని అంశాన్ని వైసీపీ తెరపైకి తేవడం విశేషం. ఏపీ ఎన్నికల తర్వాత దీనిపై తమ పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు వైవీ. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకైనా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆయన అన్నారు. విశాఖపై సీఎం జగన్ పెట్టిన మహూర్తాలన్నీ వెనక్కి వెళ్లిపోగా ఇప్పుడు సడన్ గా హైదరాబాద్ రాజధాని అంటూ వైసీపీ కొత్త చర్చకు తెరలేపడం సంచలనంగా మారింది.

ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం చంద్రబాబుదే. ఓటుకి నోటు కేసుకి భయపడి, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని వదిలిపెట్టి ఏపీకి పారిపోయి వచ్చిన చంద్రబాబు అమరావతి నిర్మాణం పేరుతో ఆపసోపాలు పడ్డారు. అస్మదీయులకు అన్నీ కట్టబెట్టి తాను దిగిపోయేటప్పటికి మొండిగోడలు మిగిల్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రయోగానికి అడుగడుగునా న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. విశాఖ వచ్చేస్తున్నా, కాపురం పెట్టేస్తున్నా అంటూ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రకటించారే కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. ఎన్నికల్లోపు జగన్ విశాఖ కాపురం కష్టమేనని తేలిపోయింది. ఈ సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావన మాత్రం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

హైదరాబాద్ ని ఏపీకి రాజధాని చేయాలనే వైసీపీ ప్రతిపాదన కాస్త విచిత్రంగా తోస్తోంది. ఉమ్మడి రాజధాని అంటూ విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. హైదరాబాద్ ని టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలు ఎందుకో పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్ గా హైదరాబాద్ మాకు కూడా కావాలంటూ వైసీపీ డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకుంటుందా..? పోనీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తుందా..? జగన్ ఆమోదం లేనిదే వైవీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనుకోలేం. అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైసీపీ కొత్త ఆలోచనతో జనం ముందుకొచ్చేలా ఉంది. వైవీ వ్యాఖ్యలపై ఆల్రడీ బీజేపీ భగ్గుమంటోంది. టీడీపీ, జనసేన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  13 Feb 2024 11:19 AM GMT
Next Story