Telugu Global
Andhra Pradesh

టీడీపీలో విభేదాలు వైసీపీకి ప్లస్.. మరోసారి అక్కడ గెలుపు ఖాయమేనా?

తుని టీడీపీలో యనమల కుటుంబానిదే పెత్తనం. 2009లో ఓడిపోయిన తర్వాత ఆ సెగ్మెంట్ నుంచి తన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేశారు. 2014, 2019లో వరుసగా కృష్ణుడు వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై ఓడిపోయారు.

టీడీపీలో విభేదాలు వైసీపీకి ప్లస్.. మరోసారి అక్కడ గెలుపు ఖాయమేనా?
X

తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలు అధికార వైసీపీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు, లోకేశ్ ఎన్ని యాత్రలు చేసినా.. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు పార్టీకి ముప్పు తెచ్చేలా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాలో భారీగా సీట్లు గెలుచుకున్నది. ముఖ్యంగా ప్రస్తుత కాకినాడ జిల్లా పరిధిలోని తుని నియోజకవర్గం రెండు పర్యాయాలుగా వైసీపీ ఖాతాలోనే ఉన్నది. తుని నియోజకవర్గం అనగానే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడే గుర్తుకు వస్తారు. 1983 నుంచి వరుసగా ఆరు సార్లు యనమల తుని నుంచి గెలిచారు. 2009లో తొలి సారిగా యనమల ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

తుని టీడీపీలో యనమల కుటుంబానిదే పెత్తనం. 2009లో ఓడిపోయిన తర్వాత ఆ సెగ్మెంట్ నుంచి తన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేశారు. 2014, 2019లో వరుసగా కృష్ణుడు వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై ఓడిపోయారు. దాడిశెట్టి రాజా బలమైన కాపు నాయకుడు కావడంతో పాటు, మంచి పేరు కూడా ఉండటంతో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే రాజా (అశోక్ బాబు) జనసేన నుంచి పోటీ చేయడంతో దాడిశెట్టి ఆధిక్యం కాస్త తగ్గింది. ఈ సారి కూడా టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ గెలవడం ఖాయంగానే కనిపిస్తోంది.

టీడీపీలో వరుసగా రెండు సార్లు ఓడిపోయిన వారికి టికెట్లు ఉండవని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడికి టికెట్ లభిస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. తుని టికెట్ తన తమ్ముడికి ఇవ్వకపోతే కుమార్తెకు ఇవ్వాలని రామకృష్ణుడు అధిష్టానానికి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఇతర టీడీపీ నాయకులు మాత్రం యనమల కుటుంబానికి అసలు టికెట్ ఇవ్వొద్దని, వేరే కొత్త అభ్యర్థికి కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అశోక్ బాబు కూడా ఇటీవల చంద్రబాబును కలిసి వచ్చారు. స్థానిక టీడీపీ నాయకులు కూడా ఆయనకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెబుతున్నారు.

తునిలో యనమల కుటుంబాన్ని కాదని వేరే వాళ్లకు టికెట్ ఇస్తే ఇబ్బందులు తప్పవు. గత నాలుగు దశాబ్దాలుగా యనమల కుటుంబం తుని టీడీపీని శాసిస్తోంది. వారి కుటుంబాన్ని కాదని టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉండదు. అలాగని యనమల కుమార్తె లేదా సోదరుడికి టికెట్ ఇచ్చినా గెలుస్తారనే ఆశలు లేవు. దీంతో ఏం చేయాలో అధినేత చంద్రబాబుకు అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే దాటవేసే ధోరణిని అవలంభిస్తున్న చంద్రబాబు.. లోకేశ్ పాదయాత్ర పూర్తయిన తర్వాత తునిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

ఇక యనమల కుటుంబం, టీడీపీలో ఉన్న విభేదాలు అధికార వైసీపీకి కలిసి వస్తున్నాయి. ఇటీవల టీడీపీకి చెందిన కింది శ్రేణి కార్యకర్తలు పలువురు వైసీపీలో చేరారు. దాడిశెట్టికి టికెట్ ఇస్తే మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే చర్చ జరుగుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న రాజా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. టీడీపీలోని విభేదాలు మరింతగా కలిసి వస్తాయని వారు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.

First Published:  30 Jan 2023 8:57 AM GMT
Next Story