Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్ టార్గెట్ 175.. 5.20 లక్షల మంది విలేజ్ చీఫ్‌ల నియామకం

ప్రతీ గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించాలని. ప్రతీ 50 కుటుంబాలను ఒక క్లస్టర్ కింద తీసుకొని.. ఒక్కో క్లస్టర్‌కు ఇద్దరు విలేజ్ చీఫ్‌లను నియమించాలని జగన్ ఆదేశించారు.

వైఎస్ జగన్ టార్గెట్ 175.. 5.20 లక్షల మంది విలేజ్ చీఫ్‌ల నియామకం
X

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ -175 అని చెబుతున్నారు. ఈ టార్గెట్ చేరుకోవడానికి పార్టీ తరపున భారీ వ్యూహానికి తెర లేపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మంది గ్రామ అధ్యక్షులను పార్టీ తరపున నియమించనున్నారు. ఈ మేరకు నియామకాలు చేపట్టాలని ఆయన జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. సీఎం క్యాంప్ ఆఫీసులో గురువారం వైసీపీ నియోజకవర్గాల పర్యవేక్షకులు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కో-ఆర్డినేటర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

రాబోయే ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాన్ని ఆయన వారికి వివరించారు. ప్రతీ గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించాలని. ప్రతీ 50 కుటుంబాలను ఒక క్లస్టర్ కింద తీసుకొని.. ఒక్కో క్లస్టర్‌కు ఇద్దరు విలేజ్ చీఫ్‌లను నియమించాలని ఆదేశించారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.66 కోట్ల కుటుంబాలను కలవాలని ఆయన చెప్పారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పర్యవేక్షకులు అందరూ కలసి ఎలా పని చేయాలో త్వరలోనే ఒక ఓరియెంటేషన్ సెషన్ ఏర్పాటు చేస్తానని జగన్ వివరించారు.

క్షేత్ర స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యచరణను రూపొందిస్తామన్నారు. ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. ప్రతీ నెల కనీసం నాలుగు నుంచి ఐదు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం తరపున ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ఇకపై పార్టీ తరపున కూడా తప్పకుండా ప్రజలను కలవాలని ఆయన కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.66 కోట్ల కుటుంబాలను రాబోయే 10 నుంచి 15 రోజుల్లో కలవాలి. అందుకే 50 కుటుంబాలకు ఇద్దరు చీఫ్‌లను ఎంపిక చేయాలి. ఇందులో ఒక మహిళ, ఒక పురుషుడు తప్పకుండా ఉండాలి. వీళ్లు తప్పకుండా నియమించిన కుటుంబాలతో నిత్యం టచ్‌లో ఉండాలని సీఎం చెప్పారు. ఇక విలేజ్/వార్డు సెక్రటేరియట్ పరిధిలో పార్టీ తరపున ముగ్గురు కన్వీనర్లను ఏర్పాటు చేయాలి. వారిలో ఒక మహిళ తప్పకుండా ఉండాలని వైఎస్ జగన్ ఆదేశించారు. వీళ్లు తమకు కేటాయించిన ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించాలి.

రాజకీయ అవగాహన ఉన్న వారిని కన్వీనర్లుగా నియమిస్తే పార్టీకి ఉపయోగపడుతారని చెప్పారు. 15000 గ్రామాల్లో 5.20 లక్షల గ్రామ అధ్యక్షులను నియమించాలని ఆయన ఆదేశించారు. వీరితో పాటు 45,000 కన్వీనర్లను కూడా వెంటనే అపాయింట్ చేయాలని అన్నారు. పార్టీ పర్యవేక్షకులు ఈ నియామకాలన్నీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. రాబోయే కొన్ని నెలలు మనం ఎంత కష్టపడితే.. మనకు అంత మంచి ఫలితాలు వస్తాయని జగన్ చెప్పారు. ఇప్పటికే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లోని 92 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయి. అలాగే అర్బన్ ఏరియాల్లో 84 శాతం, మున్సిపాలిటీల్లో 80 శాతం కుటుంబాలు మన పథకాల కారణంగా లబ్ది పొందాయన్నారు. వీళ్లు మన పార్టీకి ఓటేసేలా చేయగలిగితే తప్పకుండా టార్గెట్ 175 చేరుకోవడం కష్టం కాదని ఆయన చెప్పుకొచ్చారు.

First Published:  9 Dec 2022 2:02 AM GMT
Next Story