Telugu Global
Andhra Pradesh

నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు..

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేమని వారిద్దరితో జగన్ చెప్పినట్టు, దీంతో వారు విప్ ధిక్కరించినట్టు చెబుతున్నారు. దీనికితోడు ఇప్పుడు 15నుంచి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారంటూ పార్టీ పెద్ద నిందే వేసింది.

నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు..
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ధిక్కరించిన కారణంతో నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ లో ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను వారిని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఆ నలుగురు పార్టీ విప్ ని ఉల్లంఘించి క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడినట్టు నిర్థారణ అయిందని, అందుకే సస్పెండ్ చేశామన్నారు.

క్రాస్‌ ఓటింగ్‌ పై అంతర్గత విచారణ జరిపామని, దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు సజ్జల. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. తమకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోందని చెప్పారు. ఒక్కొకరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు చంద్రబాబు ఆఫర్‌ చేశారని, క్రాస్‌ ఓటింగ్‌ చేసినవాళ్లకు టికెట్‌ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చని సజ్జల అన్నారు.

ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదివరకే పార్టీకి దూరంగా జరిగారు. వారిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తామన్నారు. అంటే వారిద్దరూ టీడీపీ అభ్యర్థికే ఓటు వేసినట్టు స్పష్టమైంది. ఇక ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తాము ఏ తప్పూ చేయలేదని, క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని మీడియాకు వివరణ ఇచ్చారు. పార్టీ విప్ ధిక్కరించలేదని, పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకే ఓటు వేశామని చెప్పారు. కానీ వైసీపీ అంతర్గత విచారణలో మాత్రం వారిద్దరూ టీడీపీకి ఓటు వేసినట్టు తేలిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేమని వారిద్దరితో జగన్ చెప్పినట్టు, దీంతో వారు విప్ ధిక్కరించినట్టు చెబుతున్నారు. దీనికితోడు ఇప్పుడు 15నుంచి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారంటూ పార్టీ పెద్ద నిందే వేసింది. దీనిపై ఆ నలుగురు ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  24 March 2023 12:26 PM GMT
Next Story