Telugu Global
Andhra Pradesh

వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్ కు అప్పగింత

వైసీపీ సోషల్ మీడియాలో భారీ మార్పు చేశారు సీఎం వైఎస్ జగన్‌.

వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్ కు అప్పగింత
X

వైసీపీ సోషల్ మీడియాలో భారీ మార్పు చేశారు సీఎం వైఎస్ జగన్‌. అసలు పార్టీలో ఏం జరుగుతోందన్న దానిపై సోమవారం ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఐప్యాక్ ప్రతినిధి రిషిరాజ్, ఆయన టీం సభ్యులు, వైసీపీ సోషల్ మీడియా సమన్వయకర్తలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. దాదాపు రెండున్నర గంట పాటు సీఎం లోతుగా ఆరా తీశారు.

ఇప్పటి వరకు ఎంపీ విజయసాయిరెడ్డి... వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని చూసేవారు. విజయసాయిరెడ్డికి సన్నిహితుడైన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా కిందిస్థాయిలో పర్యవేక్షణ చేసేవారు. అయితే విజయసాయిరెడ్డి అనేక విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా ఢిల్లీలో బిజీగా ఉండడంతో .. సోషల్ మీడియా వ్యవహారాలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయారు. మీడియా, సోషల్ మీడియాపై నిరంతర పర్యవేక్షణ అవసరమన్న నిర్ణయానికి సీఎం జగన్‌ వచ్చారు.

సోమవారం జరిగిన భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌ కూడా హాజరయ్యారు. యువకుడైన భార్గవ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఎంబీఏ చదివారు. ముఖ్యమంత్రే స్వయంగా భార్గవ్‌ ఇకపై వైసీపీ సోషల్ మీడియాను లీడ్ చేస్తారని ప్రకటించారు. ప్రస్తుతం భార్గవ్ హైదరాబాద్‌లో ఉంటున్న నేపథ్యంలో.. ఇకపై తన కార్యాలయానికి, పార్టీకి పూర్తిగా అందుబాటులో ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. జగన్‌ బంధువు అర్జున్ రెడ్డి కూడా ఇకపై వైసీపీ సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషించనున్నారు.

First Published:  13 Sep 2022 7:15 AM GMT
Next Story