Telugu Global
Andhra Pradesh

రాయుడిపై గౌరవంగా, హుందాగా..

మంత్రి అంబటి రాంబాబు చాలా సున్నితంగా స్పందించారు. అంబటి రాయుడు 'ప్రస్తుతం ఈ టీంలో ఆడుతున్నాడు!' అని ట్వీట్ వేసి సరిపెట్టారు.

రాయుడిపై గౌరవంగా, హుందాగా..
X

వైసీపీకి షాకిచ్చాడనడానికి అంబటి రాయుడు పెద్ద స్థాయి నేత కాదు. అలాగని రాయుడు ఆడిన గేమ్ తో వైసీపీకి నష్టం జరగలేదా అంటే.. లేదని చెప్పలేం. కండువా కప్పిన సీఎం జగన్ సహా ఆయన దగ్గరకు వెళ్లడానికి సహకరించిన నేతలందరినీ కలిపి అమాయకుల్ని చేశారు అంబటి రాయుడు. ఆ మాటకొస్తే.. వైసీపీకి దూరం జరిగింది కేవలం క్రికెట్ మ్యాచ్ ల కోసమేనని చెప్పి రెండు రోజుల గ్యాప్ తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ ని కలవడం ఈ ఆటలో మరో ట్విస్ట్. ఈ మొత్తం ఎపిసోడ్ పై అసలు వైసీపీకి ఎలా స్పందించాలో తెలియడంలేదు. రాయుడిని తిట్టలేరు, అలాగని ఆయన జనసేన ఎంట్రీపై స్పందించకుండా ఉండలేరు. సాక్షి కూడా రాయుడు వ్యవహారాన్ని పూర్తిగా లైట్ తీసుకుంది.


అంబటి రియాక్షన్ ఇది..

మంత్రి అంబటి రాంబాబు మాత్రం చాలా సున్నితంగా స్పందించారు. అంబటి రాయుడు 'ప్రస్తుతం ఈ టీంలో ఆడుతున్నాడు!' అని ట్వీట్ వేసి సరిపెట్టారు. ఇక వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో మాత్రం టీడీపీ కూటమివైపు వెళ్తున్నవన్నీ చీమలు, వైసీపీ వైపు వస్తున్నవన్నీ ఏనుగులు అన్నట్టుగా ఓ కార్టూన్ క్రియేట్ చేశారు. మొత్తమ్మీద అంబటి ఎసిపోడ్ లో వైసీపీ గౌరవంగా, హుందాగా స్పందిస్తున్నట్టు అర్థమవుతోంది.


జగన్ అంచనా నిజమవుతుందా..?

గెలిచేవారికే వైసీపీ టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారు, వారికే ఇన్ చార్జ్ పదవులిస్తున్నారు. ఆ లెక్కన అంబటి రాయుడు గుంటూరులో గెలవలేరు అని సీఎం జగన్ డిసైడ్ కావడం వల్లే పక్కనపెట్టారు. ఇప్పుడు అదే రాయుడు టీడీపీ-జనసేన కూటమి తరపున గుంటూరు అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు. అదే నిజమైతే ఆ స్థానం నుంచి అంబటి రాయుడు గెలుస్తారా లేదా అనేది ఆసక్తికర విషయం. ఒకవేళ అంబటి ఓడిపోతే, వైసీపీ లెక్క కరెక్ట్. అదే సీటులో గెలిస్తే మాత్రం వారి లెక్క తప్పు అని తేలిపోతుంది. మొత్తమ్మీద అంబటి రాయుడు ఎంట్రీయే ఇంత సందిగ్ధంలో ఉంటే, ఇక ఆయన పొలిటికల్ కెరీర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

First Published:  11 Jan 2024 2:39 AM GMT
Next Story