Telugu Global
Andhra Pradesh

ఆ 23మంది ఈ నలుగురు ఒకటేనా..?

అప్పట్లో నాయకులు పార్టీని వీడారు, ఇప్పుడు నాయకులపై పార్టీయే వేటు వేసింది. ఆ 23మంది 2019 ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బంది పడినా ఈ నలుగురు 2024లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. బలం నాయకులదా, లేక జగన్ ఫొటోదా.. మరో ఏడాదిలో తేలిపోతుంది.

ఆ 23మంది ఈ నలుగురు ఒకటేనా..?
X

2014 ఎన్నికల తర్వాత విడతల వారీగా 23మంది వైసీపీని వీడి చంద్రబాబు పంచన చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చి ఆదుకున్నారు, మరికొందరికి ఏదోరకంగా మేళ్లు చేసి సరిపెట్టారు చంద్రబాబు. అయితే ఆ 23మంది రాజకీయ భవిష్యత్తు మాత్రం అంధకారంగా మారింది. అటు టీడీపీనుంచి గెవలేక, ఇటు వైసీపీవైపు తిరిగి చూడలేక ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మళ్లీ ఇప్పుడు నలుగురు తెరపైకి వచ్చారు. అధికార వైసీపీ నుంచి ఆ నలుగురు బలవంతంగా బయటకొచ్చారు. ఆ 23మందికి పట్టినగతే ఈ నలుగురికి కూడా పడుతుందని శాపనార్థాలు పెడుతున్నారు కొంతమంది వైసీపీ నేతలు. ఇందులో నిజమెంత..?
అప్పట్లో అధికార టీడీపీ, వైసీపీని బలహీనపరచాలనే వ్యూహంతో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి 23మందిని తనవైపు తిప్పుకుంది. అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా ప్రలోభ పెట్టారు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉండటానికైనా సిద్ధపడతాను కానీ టీడీపీలో మాత్రం చేరేది లేదన్నారు. మంత్రి పదవి ఆఫర్ చేసినా టీడీపీలో చేరలేదని గతంలో చాలాసార్లు చెప్పారు కోటంరెడ్డి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడ్డారు, తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు, ఈ సారి పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు కోటంరెడ్డి. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. చివరకు పార్టీకి దూరం జరిగారు. ఏడాదిన్నర కాలం అధికార ఎమ్మెల్యేగా పెత్తనం చలాయించే అవకాశం ఉన్నా కూడా తాను వైసీపీని వదిలిపెట్టాల్సి వచ్చిందంటున్నారు కోటంరెడ్డి. అప్పట్లో అధికార టీడీపీ ఆఫర్ ని తిరస్కరించిన కోటంరెడ్డి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం మొదటినుంచీ జగన్ కి అండగా నిలబడింది. పార్టీ పెట్టకముందునుంచీ జగన్ తోనే ఉన్నారు, పార్టీ పెట్టాక అందరితో కలసి ఇబ్బందులు పడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీని ఎదుర్కొని 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రశేఖర్ రెడ్డి. 2024లో టికెట్ ఇవ్వలేను అని జగన్ కరాఖండిగా చెప్పడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ అంటూ ఆయన్ను పార్టీ దూరం పెట్టింది. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీనుంచి గత ఎన్నికల సమయంలో సడన్ గా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి, నియోజకవర్గం విషయంలో అయిష్టంగానే వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేవని పోరుపెడుతూనే ఉన్నారు. చివరకు ఆయన్ని కూడా పార్టీ దూరం పెట్టింది, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వేటు వేసింది. ఉండవల్లి శ్రీదేవి రాజకీయాల్లో సడన్ ఎంట్రీ అయినా ఆమె ఎక్కువకాలం వైసీపీలో ఇమడలేకపోయారు. అందరికంటే ఎక్కువగా జగన్ ని పొగిడినా కూడా ఫలితం లేకపోయింది. ఆమె మంత్రి పదవి ఆశించి ఉంటారనుకోలేం కానీ, ఇన్ చార్జ్ ని తీసుకొచ్చి నెత్తిన పెట్టేసరికి తట్టుకోలేకపోయారు. చివరకు ఎమ్మెల్యే టికెట్ రాదని తెలిసి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ నిందతో బయటకు రావాల్సి వచ్చింది.

అప్పట్లో వైసీపీని వీడిన 23మంది టీడీపీ ప్రలోభాలకు లొంగారనే అనుకుందాం. కానీ ఇప్పుడు వైసీపీ బహిష్కరించిన నలుగురికి ఆ అకాశం కల్పించింది స్వయానా పార్టీయే. అప్పట్లో నాయకులు పార్టీని వీడారు, ఇప్పుడు నాయకులపై పార్టీయే వేటు వేసింది. మరి ఆ 23మందితో ఈ నలుగురిని పోల్చి చూడవచ్చా. అప్పటికప్పుడు టీడీపీలో చేరి లబ్ధిపొందాలనే ఉద్దేశం ఆ23మందిలో ఉంది. ఇప్పుడు పార్టీకి దూరమైతే తమ భవిష్యత్తు ఏమవుతుందోననే భయం ఈ నలుగురిలో ఉంది, కానీ పరిస్థితులు సహకరించలేదు. కాలం కలసిరాలేదు. అందుకే దూరం జరిగారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సొంతగా గెలిచే బలం కానీ, బలగం కానీ లేవనుకుందాం. కానీ ఆనం, కోటంరెడ్డికి నెల్లూరు జిల్లా రాజకీయాలపై పట్టు ఉంది. 2019లో ఓడిపోయిన సోమిరెడ్డి, నారాయణ వంటి సీనియర్ల అండదండలు కూడా జిల్లా నేతలకి ఉన్నాయి. ఈసారి నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి. ఆ 23మంది 2019 ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బంది పడినా ఈ నలుగురు 2024లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. బలం నాయకులదా, లేక జగన్ ఫొటోదా.. మరో ఏడాదిలో తేలిపోతుంది.

Next Story