Telugu Global
Andhra Pradesh

వైసీపీలో ఉంటే ప్రతిరోజూ శీల పరీక్ష తప్పదా..?

తానెక్కడికీ పోవడం లేదని, తన చివరి రక్తపు బొట్టు కూడా జగన్ కోసమేనని, ప్రాణం పోయే వరకు వైసీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి .

వైసీపీలో ఉంటే ప్రతిరోజూ శీల పరీక్ష తప్పదా..?
X

వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. నలుగురు బయటకు పోయారు సరే, లోపల ఉన్న 40మందిపై అనుమానపు చూపులు మొదలయ్యాయి. కేవలం ఆ ఇద్దరే కాదు, వచ్చే ఎన్నికల్లో మీకు సీటు లేదు అని జగన్ ఇంకొంతమంది వద్ద కూడా కుండబద్దలు కొట్టారట, మరికొందరు ఆ లిస్ట్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి వారి పరిస్థితి ఏంటి..? అలాంటివారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను తిప్పికొట్టేది ఎవరు..? ప్రస్తుతానికి ఎవరికి వారే వివరణలు ఇచ్చుకుంటున్నారు.

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాజా బాధితుడు. ప్రసన్న వైసీపీని వీడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మంత్రి పదవి రాకపోవడంతో అలిగి ఆయన జగన్ కి బైబై చెప్పేశారని ఓ వాట్సప్ వార్త హల్ చల్ చేసింది. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చుకున్నారు. తానెక్కడికీ పోవడం లేదని, తన చివరి రక్తపు బొట్టు కూడా జగన్ కోసమేనని, ప్రాణం పోయే వరకు వైసీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబే ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నాని, నిన్నటి నుంచి తనకు వస్తున్న ఫోన్ కాల్స్ కి ఆన్సర్ చేయలేకపోతున్నానని వాపోయారు.

ఇంకెంతమంది..?

రెండు నెలల క్రితం వరకు వైసీపీలో అసంతృప్తులు లేరు అని అనుకున్నారంతా. ముందుగా ఆనం తెరపైకి వస్తే, మంత్రి పదవి రాకపోవడమే కారణం అన్నారు. ఆ తర్వాత కోటంరెడ్డి బయటపడే సరికి అందరూ షాకయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలనాటికి మరో రెండు వికెట్లు పడ్డాయి. వీరే కాదు, మరో 40మంది అసంతృప్తులు వైసీపీలో ఉన్నారంటూ కోటంరెడ్డి లాంటి నాయకులు బాంబులు పేలుస్తుండే సరికి వైసీపీలో ఒకరినొకరు అనుమానంగా చూసుకోవాల్సిన పరిస్థితి. జగన్ తో మొదటినుంచీ అనుబంధం ఉన్న కోటంరెడ్డి, మేకపాటి కుటుంబాలే బయటపడే సరికి.. పక్క పార్టీలనుంచి వచ్చినవారికి చిక్కొచ్చిపడింది. వారు కూడా ముందుగానే తమ పాతివ్రత్యాన్ని బయటపెట్టుకుంటున్నారు. తమకి టీడీపీ డబ్బులు ఆఫర్ చేసినా ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదని చెప్పారు రాపాక వరప్రసాద్, మద్దాలి గిరి. తాము వైసీపీలోనే కొనసాగుతామంటూ వివరణ ఇచ్చుకున్నారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇలా రోజుకొకరు ఫేక్ న్యూస్ కి భయపడి మీడియా ముందుకొచ్చి.. తమ చివరి రక్తపు బొట్టుని కూడా జగన్ కే ధారపోస్తామంటూ బహిరంగంగా చెప్పుకోవాలా..? వైసీపీలో ఉంటే ప్రతిరోజూ శీల పరీక్ష తప్పదా..? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎవరు ఏ చిన్న మాట మాట్లాడినా సోషల్ మీడియాలో పెడర్థాలు ఎక్కువయ్యాయి. అందుకే నాయకులంతా జాగ్రత్తపడుతున్నారు. పుకార్లు వచ్చినా కూడా వెంటనే స్పందిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమ నిజాయితీ నిరూపించుకుంటున్నారు.

First Published:  28 March 2023 6:50 AM GMT
Next Story