Telugu Global
Andhra Pradesh

అంతలోనే అలక.. అంతలోనే జ్ఞానోదయం

సీఎం జగన్ కు తనను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవరైనా తన జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతానంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పద్మావతి.

అంతలోనే అలక.. అంతలోనే జ్ఞానోదయం
X

నిన్న ఫేస్ బుక్ లైవ్ పెట్టి వెటరన్ పొలిటీషియన్లంటూ సొంత పార్టీ నేతల్నే వెటకారంగా మాట్లాడారు శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. అక్కడ సీన్ కట్ చేస్తే సాయంత్రం తాడేపల్లి వెళ్లి అధిష్టానాన్ని కలిశారు. బయటకొచ్చి ఎల్లో మీడియాపై మండిపడ్డారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు. జగనన్న స్ఫూర్తితోనే ముందుకెళ్తానని చెప్పానని, ఆ మాట మాత్రం హైలైట్ చేయలేదన్నారు. కొంతమంది అధికారుల తీరుతో విసిగిపోయి తాను అలా మాట్లాడానన్నారు ఎమ్మెల్యే పద్మావతి. తానెక్కడా సీఎం జగన్ ని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. ఆ మాటకొస్తే పార్టీకి వ్యతిరేకంగా కూడా తానెక్కడా గీత దాటలేదన్నారు. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటానని, పార్టీకోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ కు తనను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవరైనా తన జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతానంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పద్మావతి.

అంతకు ముందు బాబు కూడా..

పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు విషయంలో జరిగింది కూడా ఇదే. ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అని తెలియడంతో పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు బాబు. వైసీపీలో ఎస్సీ ఎమ్మెల్యేలకు విలువ లేదని, పెత్తనమంతా పెద్దరెడ్ల చేతుల్లోనే ఉందన్నారు. తన తప్పులేకపోయినా తనను మారుస్తున్నారని మండిపడ్డారు. అయితే గంటల వ్యవధిలోనే ఆయనకు కూడా అప్పట్లో జ్ఞానోదయం అయింది. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ ఎల్లోమీడియాపై మండిపడ్డారు బాబు. తాను జగన్ వెంటే ఉంటానని టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీకోసం కష్టపడతానన్నారు.

ఎందుకిలా..?

అసంతృప్తిని బయటపెట్టేందుకు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, దాన్ని కవర్ చేసుకోడానికి మరోసారి మీడియా ముందుకు రావడం ఎందుకు..? ప్రస్తుతం ఏపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు ఇలాంటి సీన్లు క్రియేట్ చేస్తున్నారు. చెప్పాల్సినవన్నీ ముందుగా చెప్పేస్తారు, ఆ తర్వాత ఎల్లో మీడియా వక్రీకరణలు అని అనేస్తున్నారు. అంటే వారి మనసులోని మాట బయటకు వెళ్తుంది, అదే సమయంలో నింద ఎల్లో మీడియాపై వేసేయొచ్చు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు నేతలు. సాధారణ పరిస్థితుల్లో వారిని బుజ్జగించే అవకాశం ఉండదు. ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా మాట్లాడితే మాత్రం తాడేపల్లి నుంచి పిలుపొస్తుంది, ఏదో ఒక హామీ లభిస్తుంది. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇదే పద్ధతి అనుసరించడం విశేషం.

First Published:  10 Jan 2024 1:51 AM GMT
Next Story