Telugu Global
Andhra Pradesh

చంటిబాబు కేరాఫ్ చంద్రబాబు.. ఏపీలో జంపింగ్ లు మొదలు

వైసీపీలో సీటు రాలేదని టీడీపీలోకి వెళ్తున్న జ్యోతుల చంటిబాబుకి అక్కడ టికెట్ గ్యారెంటీనా అంటే చెప్పలేని పరిస్థితి. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేకపోయినా ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట.

చంటిబాబు కేరాఫ్ చంద్రబాబు.. ఏపీలో జంపింగ్ లు మొదలు
X

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. సిట్టింగ్ లలో చాలామందికి సీఎం జగన్ సీట్లు ఇవ్వట్లేదని క్లారిటీ వచ్చేసింది. వారంతా ఇప్పటికిప్పుడు జగనే మా దైవం అంటున్నా.. ఎలక్షన్ వేళకు ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకుంటారనే అనుమానం ఉంది. ఇందులో కొందరు ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు. ఆ లిస్ట్ లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఒకరు. వైసీపీలో సీటు దొరక్కపోయే సరికి ఆయన టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది. వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రచారం మొదలు పెట్టారా, లేక చంటిబాబు నిజంగానే టీడీపీలోకి వెళ్తున్నారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

పాత గూటికే..

2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చంటిబాబు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల ఆయనకు పార్టీలో ఎదురుగాలి వీస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో జగ్గంపేట సీటు చంటిబాబుకి ఇవ్వట్లేదని తేలిపోయింది. ఇటీవల అధిష్టానంతో మీటింగ్ లో చంటిబాబుకి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆయన టీడీపీ గూటికి తిరిగి వెళ్తారనే ప్రచారం మొదలైంది.

టీడీపీలో టికెట్ గ్యారెంటీయేనా..?

వైసీపీలో సీటు రాలేదని టీడీపీలోకి వెళ్తున్న జ్యోతుల చంటిబాబుకి అక్కడ టికెట్ గ్యారెంటీనా అంటే చెప్పలేని పరిస్థితి. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేకపోయినా ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట. ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది. జనవరి 5 లేదా 6న చంటిబాబు, పసుపు కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అదే నిజమైతే వైసీపీలోని మరింతమంది అసంతృప్తులకు చంటిబాబు దారి చూపించినట్టవుతుంది. ముందు వారికంటూ ఏదో ఒక పార్టీ టికెట్ దొరికి, ఆ టికెట్ పై గెలిస్తే.. ఆ తర్వాత అవకాశాన్నిబట్టి అధికార పార్టీలోకి జంప్ అయిపోవచ్చు. అంతేకాని అధికార పార్టీతోనే అంటిపెట్టుకుని ఉండి, టికెట్ రాక సతమతమవడానికి ఇప్పుడు ఎవరూ ఇష్టపడటంలేదు. మరి చంటిబాబు బాటలో ఇంకెంతమంది టీడీపీవైపు వెళ్తారో వేచి చూడాలి.

First Published:  25 Dec 2023 9:23 AM GMT
Next Story