Telugu Global
Andhra Pradesh

ఆ జీవోకే కట్టుబడి ఉన్నాం.. వైసీపీ మంత్రులు

పేద ప్రజల ప్రాణాల రక్షణకే ప్రభుత్వం జీవో నెం.1 తెచ్చిందని, జీవోకు తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు కూడా గమనించాలన్నారు.

ఆ జీవోకే కట్టుబడి ఉన్నాం.. వైసీపీ మంత్రులు
X

సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-1 పై రేగిన రాజకీయ దుమారం తెలిసిందే. ఈ జీవో అమలుని నిలిపివేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై తాజాగా ఏపీ హైకోర్టు విచారణ జరిపింది, ఈనెల 23 వరకు జీవో-1 ని రద్దు చేసింది. కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి, ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు కూడా హైకోర్టు తీర్పుపై స్పందించారు. జీవో నెంబర్ -1ను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టేవారి కోసమే ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారాయన. సభల పేరుతో కందుకూరు, గుంటూరులో 11 మంది బలి తీసుకున్నారని మంత్రి సురేష్‌ ఆరోపించారు.

జీవో నెంబర్-1 కు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. పేద ప్రజల ప్రాణాల రక్షణకే ప్రభుత్వం జీవో నెం.1 తెచ్చిందని, జీవోకు తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు కూడా గమనించాలన్నారు. పేదల కోసం జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు ఆలోచించారా? అంటూ మంత్రి నాగార్జున మండిపడ్డారు. జీవో అమలు విషయంలో తుది తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో జీవో రచ్చ..

ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో కుప్పంలో చంద్రబాబు పర్యటన ఆగిపోయింది, ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ పరామర్శించడంతో రాజకీయ మాటల యుద్ధం మొదలైంది. అదే సమయంలో పోలీసులు, అధికార పార్టీ నేతలకు వంత పాడుతున్నారని, వారి సభలు, సమావేశాలకు మాత్రం అడ్డు చెప్పడంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై పోలీసులు వివరణ ఇస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం వినడంలేదు. జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం దాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

First Published:  12 Jan 2023 6:02 PM GMT
Next Story