Telugu Global
Andhra Pradesh

టీడీపీకి లేనిపోని ప్రచారం చేస్తున్న వైసీపీ మీడియా

వైసీపీని వీడిపోతున్న వారిని టీడీపీ అనుకూల మీడియా ఆకాశానికెత్తేస్తున్నట్టు.. టీడీపీ-జనసేన టికెట్లు దక్కని అసంతృప్తులను వైసీపీ అనుకూల మీడియా భుజాన మోస్తోంది.

టీడీపీకి లేనిపోని ప్రచారం చేస్తున్న వైసీపీ మీడియా
X

ఇటీవల ఏపీలో టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా విడుదలైంది. టీడీపీ అనుకూల మీడియా అందులో ఉన్న పేర్లు చెప్పి సరిపెట్టుకుంది. కానీ అక్కడినుంచి వైసీపీ మీడియా ఆ జాబితా బాధ్యత భుజాన వేసుకుంది. టికెట్ ఎవరికిచ్చారు, ఎవరు అసంతృప్తికి లోనయ్యారు, ఎవరు అలిగారు, ఎవరు నిరసనలకు దిగారు, ఎవరు రచ్చ చేస్తున్నారంటూ వెదికి మరీ వార్తలిస్తోంది. ఈ వార్తలన్నీ చూస్తే అసలు టీడీపీ-జనసేన టికెట్లకు ఇంత కాంపిటీషన్ ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. కాంపిటీషన్ ఉంది అంటే.. కచ్చితంగా వారంతా టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మినవారే కదా, జగన్ ని లైట్ తీసుకున్నవారే కదా. అలాంటి వారిని హైలైట్ చేస్తూ వైసీపీ అనుకూల మీడియా సాధించేదేంటి..? టీడీపీకి లేనిపోని ప్రచారం కల్పించడం దేనికి..?

టీడీపీ-జనసేన కూటమి తరపున టికెట్ రాలేదని ఒకరు నిరాహార దీక్షకు దిగారు, మరొక నాయకుడి అభిమాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు, ఇంకో నాయకుడు తన అనుచరులతో కలసి చంద్రబాబు ఇంటి ముందు ధర్నా మొదలు పెట్టారు. మరో కుటుంబం తమని పవన్ కల్యాణ్ మోసం చేశారంటూ రోడ్డెక్కింది. తొలి జాబితా తర్వాత ఈ పరిస్థితి ఊహించినదే కానీ.. దీన్ని సాక్షి సహా.. వైసీపీ సోషల్ మీడియా ఈ అంశాలను హైలైట్ చేయడమే కాస్త విచిత్రంగా తోస్తోంది. వైసీపీని వీడిపోతున్న వారిని టీడీపీ అనుకూల మీడియా ఆకాశానికెత్తేస్తున్నట్టు.. టీడీపీ-జనసేన టికెట్లు దక్కని అసంతృప్తులను వైసీపీ అనుకూల మీడియా భుజాన మోస్తోంది.

టీడీపీలో అంత కాంపిటీషన్ ఉందా..?

వాస్తవానికి టీడీపీ, జనసేనలో టికెట్లకోసం పెద్దగా పోటీ లేదు. కాకపోతే ముందునుంచీ ఉన్న నాయకుల్ని కాదని, కొత్తవారిని తెరపైకి తేవడం, గెలుపు గుర్రాల పేరిట ఎన్నారైలను రంగంలోకి దించడంతోనే సమస్య మొదలైంది. ఉదాహరణకు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు, గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు కూడా అదే పార్టీలో ఉన్నారు. వారిద్దర్నీ కాదని ఓ ఎన్నారైకి టికెట్ కేటాయించారు చంద్రబాబు. దీంతో గొడవ మొదలైంది. వైసీపీలోకూడా టికెట్ల కేటాయింపులో అలకలు ఉన్నాయి, కానీ జగన్ మాటపై గౌరవంతో ఎవరూ గీత దాటట్లేదు. లోపల ఉన్న వ్యతిరేకత సరిగ్గా ఎన్నికల టైమ్ లో బయటపడితే మాత్రం ప్రమాదం. మొత్తానికి టీడీపీ అసంతృప్త నేతలు గతంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ అనుకూల మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ ఛాన్స్ కొట్టేశారు.

First Published:  26 Feb 2024 7:33 AM GMT
Next Story