Telugu Global
Andhra Pradesh

వైసీపీ నుంచి పవన్ కి ఫుల్ కోటింగ్..

“రెండుసార్లు గెలిచిన నేను, రెండుచోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా.. తూ.. ప్రజలకోసం తప్పట్లేదు” అంటూ రోజా ట్వీట్ పెట్టారు.

వైసీపీ నుంచి పవన్ కి ఫుల్ కోటింగ్..
X

పవన్ కల్యాణ్ పై మామూలుగానే ఓ రేంజ్ లో విరుచుకుపడుతుంటారు ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు. అలాంటిది రణస్థలం మీటింగ్ లో పవన్ పేరు పేరునా ప్రతి ఒక్కరిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు, దీంతో వైసీపీ నేతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. అవకాశం ఉన్నవారు ప్రెస్మీట్ పెట్టారు, లేనివాళ్లు ట్వీట్లతో చాకిరేవు పెట్టారు. మొత్తానికి పవన్ కి ఫుల్ కోటింగ్ ఇచ్చేశారు.

రాజకీయ వ్యభిచారం..!!

ఓ వైపు బీజేపీతో పొత్తులో ఉండి మరోవైపు టీడీపీతో అంటకాగుతున్న పవన్.. బరితెగింపు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. బీజేపీతో సంసారం చేస్తూ, టీడీపీకి కన్ను కొట్టడాన్ని రాజకీయ వ్యభిచారం అంటారన్నారు. సభలో పవన్ కల్యాణ్ చెప్పినవాటిలో ఒకే ఒక్క నిజం ఉందన్నారు నాని. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని పవన్ చెప్పారని, అదొక్కటే వాస్తవం అని అన్నారు. గతంలో జగన్ చేతిలో ఒకసారి బడితెపూజ జరిగిందని, ఈసారి కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడన్నారు. తానెందుకు చంద్రబాబు సంకలో దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ ఈ సభ ఏర్పాటు చేశారని.. యువతకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి అంతా వట్టిదేనన్నారు. మంత్రి రోజాను డైమండ్‌ రాణి అంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్లపై తీవ్రంగా మండిపడ్డారు పేర్ని నాని. రోజా సినిమాల్లో నటించిందనే ఉద్దేశంతోనే అంతగా దిగజారి మాట్లాడారని, ఆయన ఇంట్లో ఆడవాళ్లు సినిమాల్లో నటించలేదా అని నిలదీశారు.

బానిస అనక బాహుబలి అంటారా..?

అమ్మని తిట్టారని ఏడ్చి, అలగాజనం అన్నారని ఏడ్చి.. చివరకు వారి పల్లకినే మోస్తున్న పవన్ కల్యాణ్ ని బానిస అనక, బాహుబలి అంటారా అని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నాకు తెలిసింది పోరాటమే, ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు క్యా బాత్ హై అంటూ కౌంటర్ ఇచ్చారాయన.


కల్యాణాల పవన్..

తాను సంబరాల రాంబాబు అయితే, ఆయన కల్యాణాల పవన్ అని ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. రోజా డైమండ్ రాణి అయితే పవన్.. బాబుగారి జోకర్ అంటూ మరో సెటైర్ పేల్చారు. పీకే అంటే పిచ్చి కుక్క అంటూ ఘాటు ట్వీట్ కూడా పెట్టారు అంబటి.


రోజా కూడా..

పవన కల్యాణ్ ప్రసంగంలో మంత్రి రోజాపై చేసిన విమర్శలు తీవ్ర సంచలనంగా మారాయి. డైమండ్ రాణి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ నేతలంతా తప్పుబట్టారు. రోజా కూడా దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. “రెండుసార్లు గెలిచిన నేను, రెండుచోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా.. తూ.. ప్రజలకోసం తప్పట్లేదు” అంటూ రోజా ట్వీట్ పెట్టారు. పవన్ కల్యాణ్ సభ తర్వాత వైసీపీ నుంచి వరుస కౌంటర్లు మొదలయ్యాయి. ఈ రియాక్షన్లు మరో రెండురోజులపాటు మరింత ఘాటుగా ఉండే అవకాశముంది.Next Story