Telugu Global
Andhra Pradesh

వైసీపీకి గృహ సారథులు దొరకడంలేదా..?

అధికార పార్టీ పిలిస్తే ఇలాంటి నియామకాలకోసం చాలామంది పోటీ పడతారు. కానీ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. దీంతో చేసేదేం లేక గృహసారథుల నియామకంపై సమీక్ష చేపట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి గడువుని జనవరి-31కి పొడిగించారు.

వైసీపీకి గృహ సారథులు దొరకడంలేదా..?
X

పార్టీ పటిష్టతకోసం వైసీపీ గృహసారథులు అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి గ్రామాలు, వార్డుల్లో ఉన్న వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగానే ఉన్నా.. ఎన్నికల సమయంలో వారిని ఈసీ పక్కనపెడుతోంది. దీన్ని నివారించేందుకు పార్టీని మరింత పటిష్టపరిచేందుకు వాలంటీర్లు వేరు, వైసీపీ కార్యకర్తలు వేరు అనే భావన తీసుకొచ్చేందుకు గృహసారథులు అనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది అధిష్టానం.


వాలంటీర్ల దగ్గర ఉన్న డేటా అంతా గృహసారథుల దగ్గర కూడా ఉండేలా జాగ్రత్తపడుతోంది. దీనికి సంబంధించిన నియామకాలు ఈనెల 21తో పూర్తి కావాలనే డెడ్ లైన్ కూడా విధించారు జగన్. కానీ అనుకున్న సమయానికి గృహసారథుల నియామకం పూర్తి కాలేదు. దీంతో ఈ నియామకాల గడువుని నెలాఖరు వరకు పొడిగించారు.

కారణం ఏంటి..?

గృహసారథులు అంటే కేవలం వైసీపీ సానుభూతి పరులే, అంతకు మించి వారికి వేరే క్వాలిఫికేషన్ అవసరం లేదు. సచివాలయం పరిధిలో ముగ్గురు సారథులు ఉంటే వారిలో ఒకరు మహిళ అయి ఉండాలి. స్మార్ట్ ఫోన్ల వాడకం, ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉంటే చాలు. మరి రాష్ట్రంలో వైసీపీకి గృహసారథులు ఎందుకు దొరకలేదు..? స్మార్ట్ ఫోన్లపై అవగాహన, ప్రభుత్వ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉన్నవారు ముందుకు రావడంలేదా అనేది ప్రశ్నార్థకం.

గ్రూపులతో గోల..

గృహసారథుల విషయంలో ఎమ్మెల్యే గ్రూపు ఇద్దరిని నియమిస్తే, పార్టీలోనే ఉన్న మరో వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేయాలనేది వైసీపీ అధిష్టానం ఆలోచన. అలాంటి గ్రూపులు లేని దగ్గర ఎలాంటి గోలా లేదు. కానీ ఇది సాధ్యం కావడంలేదు. గృహసారథులుగా, పారితోషికం లేకుండా పార్టీకి సేవచేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. భవిష్యత్తులో పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది అని చెప్పినా కూడా నాయకులు పిలిచినప్పుడల్లా పరిగెత్తుకు వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరని తేలిపోయింది.


కార్యకర్తలను నియమించాలనుకుంటున్నా వారు కూడా తమ వ్యక్తిగత పనుల్ని వదిలిపెట్టుకుని పార్టీకోసం కష్టపడేందుకు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. అందుకే ఈ నియామకాలు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు.


అధికార పార్టీ పిలిస్తే ఇలాంటి నియామకాలకోసం చాలామంది పోటీ పడతారు. కానీ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. దీంతో చేసేదేం లేక గృహసారథుల నియామకంపై సమీక్ష చేపట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి గడువుని జనవరి-31కి పొడిగించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారథులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

First Published:  23 Jan 2023 3:49 AM GMT
Next Story