Telugu Global
Andhra Pradesh

టార్గెట్ విశాఖ.. వైసీపీలో కీలక నేతల చేరిక

ఐదేళ్ల క్రితం వివిధ కారణాలతో విశాఖ చేజారినా ఇప్పుడు ఎంపీ సీటుతో సహా విశాఖ నలు దిక్కుల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టార్గెట్ విశాఖ.. వైసీపీలో కీలక నేతల చేరిక
X

2019 ఎన్నికల్లో 151 సీట్ల భారీ మెజార్టీ వచ్చినా కూడా విశాఖ విషయంలో వైసీపీకి చేదు అనుభవమే మిగిలింది. విశాఖ ఎంపీ సీటు గెలిచినా నాలుగు ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ గెలుచుకుంది. విశాఖను పాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న సీఎం జగన్, తన ప్రమాణ స్వీకారం కూడా అక్కడినుంచే అని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖను క్లీన్ స్వీప్ చేసేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా విశాఖ నుంచి చేరికలు ఊపందుకున్నాయి. స్వయంగా సీఎం జగన్, నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన విశాఖ నేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు వైసీపీలో చేరారు. అరిలోవ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న అచ్యుతరావు, ఇకపై వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తానంటున్నారు. టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు.. కుటుంబ సభ్యులతో సహా వైసీపీలో చేరారు. విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో ఆయన క్రియాశీలక నేత. ఈ చేరికలతో విశాఖలో వైసీపీ మరింత బలపడుతుందని అంటున్నారు.

వైసీపీ గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉందని, అర్బన్ ఏరియాల్లో జగన్ పై వ్యతిరేకత ఉందని వైరి వర్గం ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా విశాఖ రాజధాని విషయంలో జగన్ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారా లేదా అనేది అక్కడ వైసీపీకి వచ్చే సీట్లను బట్టి తేలిపోతుంది. ఐదేళ్ల క్రితం వివిధ కారణాలతో విశాఖ చేజారినా ఇప్పుడు ఎంపీ సీటుతో సహా విశాఖ నలు దిక్కుల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

First Published:  18 March 2024 2:13 PM GMT
Next Story