Telugu Global
Andhra Pradesh

ఈనెల 16న ఇడుపులపాయ నుంచి ఫైనల్ లిస్ట్.. వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన

ఈనెల 16న ఇడుపులపాయకు వెళ్తున్నారు సీఎం జగన్. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వేదికగా.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఆయనే స్వయంగా ప్రకటిస్తారట.

ఈనెల 16న ఇడుపులపాయ నుంచి ఫైనల్ లిస్ట్.. వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన
X

వైసీపీ జాబితా-1, జాబితా-2 అంటూ తొలినాళ్లలో ప్రకటనలిచ్చినా.. ఆ తర్వాత మార్పులు, చేర్పులు ఎక్కువ కావడం, ఒకటీ రెండు నియోజకవర్గాలకోసమే జాబితాలు విడుదల కావడంతో నెంబర్లివ్వడం మానేశారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ చార్జ్ లు గా ఉన్న వారిలో కొంతమందికి టికెట్ గ్యారెంటీ కాదు అని కూడా తెలుసు. ఈ దశలో ఈనెల 16న ఇడుపులపాయలో వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల అంటూ కబురందడంతో వారిలో ఆందోళన స్థాయి మరింత పెరిగింది. తుది జాబితాలో ఎవరు అభ్యర్థులు, ఎవరు మారిపోతారు అనేది తేలిపోతుంది.

ఈనెల 16న ఇడుపులపాయకు వెళ్తున్నారు సీఎం జగన్. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వేదికగా.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ఆయనే స్వయంగా ప్రకటిస్తారట. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను ఆయన ప్రకటించారని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన అనంతరం సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి పూర్తి స్థాయిలో దిగుతారని అంటున్నారు.

ఇప్పటివరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమించింది వైసీపీ. మార్పులు చేర్పులు కూడా ఇందులో కలగలిపి ఉన్నాయి. మిగతా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా ఉన్నారు. అయితే వారి పేర్లు కూడా అధికారికంగా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. మిగతా పేర్లతోపాటు, ఒకటి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కూడా ఉంటుంది. అయితే మార్పు అనేది కొందరి విషయంలోనే ఉంటుందా, లేక తమదాకా వస్తుందా అని ఇన్ చార్జ్ లు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  13 March 2024 10:17 AM GMT
Next Story