Telugu Global
Andhra Pradesh

బస్సు యాత్ర సక్సెస్ అయినట్లేనా?

బస్సు యాత్రకు ముందు, పూర్తయిన వెంటనే జనాల స్పందన ఎలాగుందనే విషయంపై ప్రతిరోజు జగన్ రిపోర్టు తెప్పించుకుంటున్నారు.

బస్సు యాత్ర సక్సెస్ అయినట్లేనా?
X

అధికార వైసీపీ ఆధ్వర్యంలో మొదలైన సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్ అయినట్లేనా? గ్రౌండ్ లెవల్ నుండి అందుతున్న సమాచారం ప్రకారమైతే సక్సెస్ కాదు సూపర్ సక్సెస్ అనే అనుకోవాలి. అక్టోబర్ 25వ తేదీన మొదలైన బస్సు యాత్ర ఇప్పటికి 12 రోజుల్లో 31 నియోజకవర్గాల్లో పూర్తయ్యింది. 60 రోజుల పాటు బస్సు యాత్ర జరగాలని అంటే డిసెంబర్ 30వ తేదీకి ముగియాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు.

ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కీలకమైన నేతలు తప్పకుండా ప్రయాణం చేయాల్సిందే అని జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశాల ప్రకారమే యాత్రలో పై వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. బస్సు యాత్ర ఎక్కడికి చేరుకున్నా జనాల రిసీవింగ్ కూడా బాగా కనబడుతోంది. మామూలుగా అయితే అధికార పార్టీ నిర్వహిస్తున్న యాత్రలు, కార్యక్రమాలకు జనాలు రావటం పెద్ద విషయంకాదు.

ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార యంత్రాంగం మద్దతు కూడా ఉంటుంది కాబట్టే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే యాత్రలో భాగంగా జరుగుతున్న బహిరంగసభల్లో జనస్పందనే. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సభలకు ఎంత తోలినా స్పందించాల్సిన అవసరమైతే జనాలకు ఉండదు. కానీ ఇక్కడ జనాల స్పందన చాలా ఎక్కువగా ఉంటోంది. గడచిన నాలుగున్నరేళ్ళుగా పై వర్గాలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించటమే బస్సుయాత్ర ఉద్దేశం. సభల్లో మాట్లాడుతున్న మంత్రులు, నేతలంతా అజెండా ప్రకారమే నడుచుకుంటున్నారు. మంత్రులు, నేతల స్పీచులకు జనాల స్పందన సానుకూలంగానే కనబడుతోంది. జగన్ లేకపోయినా బస్సు యాత్రలకు ఇంతమంది జనాలు హాజరవుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ ను మాత్రమే టచ్ చేస్తున్న బస్సు యాత్ర డిసెంబర్ 30వ తేదీ నాటికి మిగిలిన నియోజకవర్గాలను కూడా పూర్తిచేయాలన్నది జగన్ టార్గెట్. బస్సు యాత్రకు ముందు, పూర్తయిన వెంటనే జనాల స్పందన ఎలాగుందనే విషయంపై ప్రతిరోజు జగన్ రిపోర్టు తెప్పించుకుంటున్నారు. డిసెంబర్ 30వ తేదీకి యాత్ర పూర్తయ్యే సమయానికి ఎన్నికల వేడి ఒక రేంజిలో ఉండబోతోంది. ఎందుకంటే మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మరీ యాత్రలు పార్టీకి ఏ మేరకు లాభం చేస్తుందో చూడాల్సిందే.


First Published:  12 Nov 2023 5:06 AM GMT
Next Story