Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డి రాజీనామాకు డిమాండ్.. వారంతా పత్తిత్తులేనా..?

కోటంరెడ్డి, జగన్ బొమ్మపై గెలిచారనే అనుకుందాం. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు బొమ్మ, జనసేన ఎమ్మెల్యే పవన్ బొమ్మను చూపించే జనంలోకి వెళ్లారు కదా. వారికి పడిన ఓట్లు కూడా ఆయా పార్టీల అధినేతలపై ఉన్న నమ్మకంతోనే కదా.

కోటంరెడ్డి రాజీనామాకు డిమాండ్.. వారంతా పత్తిత్తులేనా..?
X

“దమ్ముంటే కోటంరెడ్డి రాజీనామా చేయాలి. జగన్ బొమ్మ పెట్టుకుని, జగన్ హవాలో గెలిచి, తిరిగి జగన్ కే ఎదురు తిరుగుతావా..? సిగ్గు, రోషం ఉంటే, మగాడివి అయితే రాజీనామా చెయ్.” అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు విసిరిన సవాల్ ఇది. ఈ సవాల్ తో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని అంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీ, జనసేన నుంచి పార్టీ ఫిరాయించి జగన్ కి జై కొట్టిన నేతలు ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

“నేను చంద్రబాబు లాగా కాదు, పదవికి రాజీనామా చేస్తేనే మా పార్టీలో చేర్చుకుంటా”నని జగన్ చాలా సందర్భాల్లో చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. వీరంతా జగన్ వైపు వచ్చినా ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోలేదంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా చలామణిలో ఉన్నారు. ఇప్పుడిప్పుడు గడప గడప కార్యక్రమాలకు వైసీపీ కండువా కప్పుకునే వెళ్తున్నారు. వీరిపై ఎప్పుడూ టీడీపీ, జనసేన రచ్చ చేయలేదు. మరి కోటంరెడ్డి విషయంలో వైసీపీ ఎందుకంత యాగీ చేస్తోంది. రాజీనామా డిమాండ్ ఎందుకు..? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

కోటంరెడ్డి జగన్ బొమ్మపై గెలిచారనే అనుకుందాం. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు బొమ్మ, జనసేన ఎమ్మెల్యే పవన్ బొమ్మను చూపించే జనంలోకి వెళ్లారు కదా. వారికి పడిన ఓట్లు కూడా ఆయా పార్టీల అధినేతలపై ఉన్న నమ్మకంతోనే కదా. మరి వారికి లేని లాజిక్ కోటంరెడ్డకి మాత్రమే ఎందుకు..?

సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టేనా..?

కోటంరెడ్డి రాజీనామాకు డిమాండ్ చేసిన వారు, వైసీపీలోకి వచ్చిన పక్కపార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఏమని సమాధానం చెబుతారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేసి కండువా మార్చుకుంటే వెంటనే వైసీపీ తరపున వారిని ఎమ్మెల్సీలుగా గెలిపించుకున్నారు. మరి ఎమ్మల్యేలను ఎందుకు వదిలేశారు. వారి విషయంలో కూడా ప్రజా తీర్పు కోరవచ్చు కదా, కొత్త సంప్రదాయానికి తెరతీయొచ్చు కదా. ఎన్నికలకింగా ఏడాది టైమ్ మాత్రమే ఉన్న ఈ సందర్భంలో కోటంరెడ్డి రాజీనామాతో వైసీపీ ఏం సాధిస్తుంది..? వైసీపీ ఎదురుదాడి బాగానే ఉంది కానీ, కోటంరెడ్డి చెబుతున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలపై అధికార పార్టీ ఎందుకు స్పందించడంలేదు. కోటంరెడ్డి రాజకీయ ప్రయోజనమే చూసుకున్నాడనుకుంటే.. అసలక్కడ సమస్యలే లేవని చెప్పొచ్చు కదా. పోనీ పరిష్కరిస్తామనే హామీ ఇవ్వొచ్చు కదా. నిన్న మొన్నటి వరకు ఆయన నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలు సూపర్ డూపర్ అంటూ పొగిడిన మంత్రులే ఇప్పుడు ఆయన వ్యవహారమంతా తమకు తెలుసని విమర్శిస్తున్నారు. కోటంరెడ్డి వ్యవహారాన్ని వైసీపీయే మరింత రచ్చ చేసుకుంటోంది.

First Published:  16 March 2023 2:49 AM GMT
Next Story