Telugu Global
Andhra Pradesh

మొన్న జాకీ, నిన్న అమర్ రాజా.. వైసీపీ వివరణ ఏంటంటే..?

ఆ వార్తలు సిరాతో రాసినవి కావని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు రాసిన రెండు పేపర్లు వెంటనే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలన్నారు.

మొన్న జాకీ, నిన్న అమర్ రాజా.. వైసీపీ వివరణ ఏంటంటే..?
X

ఏపీలోని రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పెట్టాల్సిన జాకీ కంపెనీ తెలంగాణకు తరలిపోయిన మాట వాస్తవం. జాకీ కంపెనీ తరలిపోయిన తర్వాత ఆ సంస్థపై వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఆ కంపెనీ రియల్ ఎస్టేట్ సంస్థలా మారిందని, దానివల్ల ఏపీకి ప్రయోజనం లేదన్నారు. చివరకు రాప్తాడు ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో.. అసలు టీడీపీ హయాంలోనే జాకీ కంపెనీ పనులు మొదలు పెట్టలేదని, టీడీపీ నేతల వసూళ్ల పర్వానికి వారు తప్పుకున్నారని అన్నారు. తప్పుడు కథనాలు రాశారంటూ మీడియాపై మండిపడ్డారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అక్కడితో జాకీ సంగతి మరుగున పడినా, తాజాగా అమర్ రాజా కంపెనీ తెలంగాణలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో కొత్త ప్లాంట్ ప్రారంభించడానికి సిద్ధమైంది.

దేశంలోనే అతి పెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ ను తెలంగాణలో పెట్టేందుకు అమర్ రాజా ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీకి చెందిన ఓ ఎంపీ తెలంగాణలో ఎందుకు ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారు. తనకు సంబంధించిన ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేసి, పదిమందికి ఉపాధి కల్పిస్తే అతనికి ఇక్కడే మంచి మైలేజీ వచ్చేది కదా. మరి తెలంగాణలో వ్యాపారం ఎందుకు మొదలు పెట్టాలనుకున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ ని వైసీపీ ఇబ్బంది పెడుతోంది కాబట్టే అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టబోతున్నారనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై టీడీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. దీంతో వైసీపీ నుంచి వివరణ వచ్చింది.

అమర్ రాజా కంపెనీ ఏపీలో ఉందని, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా దానికి బ్రాంచీలు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఇప్పుడు మరో యూనిట్ ప్రారంభించబోతున్నారని, ఇందులో వింతేముందని అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసలు ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని అమర్ రాజా సంస్థ ఎక్కడైనా ప్రకటించిందా అని ప్రశ్నించారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కావని.. సారా తాగి చంద్రబాబు కోసం రాసిన వార్తలు అని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు రాసిన రెండు పేపర్లు వెంటనే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల పరిశ్రమలు ఏపీలో ఉండకూడదు అనుకుంటే చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉండేదా అని నిలదీశారు. పరిశ్రమలను సీఎం జగన్ ఎప్పుడూ రాజకీయ కోణంలో చూడలేదన్నారు. ఫాదర్ ఆఫ్ ఐటీ అంటూ చంద్రబాబు చెబుతున్న మాటలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు అమర్నాథ్. మొన్నటి వరకు చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నారని.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రజలకు చివరి ఎన్నికలు అంటూ మాట మార్చారని చెప్పారు.

First Published:  3 Dec 2022 9:54 AM GMT
Next Story