Telugu Global
Andhra Pradesh

ఓ వైపు వైసీపీ బస్సుయాత్ర, మరో వైపు బాలకృష్ణ పర్యటన

బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్న సమయంలోనే వైసీపీ బస్సు యాత్ర కూడా ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా హిందూపురంలో రాజకీయాలు హీటెక్కాయి.

ఓ వైపు వైసీపీ బస్సుయాత్ర, మరో వైపు బాలకృష్ణ పర్యటన
X

హిందూపురంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ హిందూపురంలో రెండో విడత వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభం కాగా, ఇదే రోజు ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. హిందూపురం నుంచి బాలయ్య వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శ ఉంది. దాదాపు పది నెలలుగా ఆయన హిందూపురంలో పర్యటించలేదు. దీంతో ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడంలేదని వైసీపీ విమర్శలు చేసింది. బాలకృష్ణ మరొకసారి హిందూపురం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇవాళ హిందూపురంలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ఓ టీడీపీ నాయకుడి ఇంట జరిగే శుభకార్యంలో బాలకృష్ణ పాల్గొననున్నారు. రేపు టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బాలకృష్ణ పాల్గొని కీలక సందేశం ఇవ్వనున్నారు.

కాగా, బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్న సమయంలోనే వైసీపీ బస్సు యాత్ర కూడా ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా హిందూపురంలో రాజకీయాలు హీటెక్కాయి. బాలకృష్ణ పది నెలలుగా నియోజకవర్గం వైపు తొంగి చూడకపోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి. నెలల విరామం తర్వాత ఎట్టకేలకు బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తుండడంతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది.

హిందూపురంలో బాలకృష్ణ పోటీ ఖాయమేనా?

గత కొద్దిరోజులుగా బాలకృష్ణ టీడీపీలో యాక్టివ్‌గా లేరు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో బాలకృష్ణ తెగ హడావుడి చేశారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు కూర్చునే స్థానంలో కూర్చొని ఏపీ, తెలంగాణ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇక పార్టీపరంగా అన్ని కార్యక్రమాలు తానే పర్యవేక్షిస్తానని తెలిపారు.

అయితే ఆ తర్వాత టీడీపీలో ఏం జరిగిందో తెలియదు కానీ నారా భువనేశ్వరి, బ్రాహ్మణి రాజకీయంగా యాక్టివ్ కాగా బాలకృష్ణ సినిమా షూటింగ్‌లకే పరిమితం అయ్యారు. చంద్రబాబు జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత కూడా బాలకృష్ణ మునిపటిలా వ్యవహరించడం లేదని టాక్ ఉంది. బాలకృష్ణ ఇక క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతారని కూడా వార్తలు వచ్చాయి. హిందూపురంలో కూడా బాలకృష్ణ పోటీ చేయకపోవచ్చని ప్రచారం జరిగింది. కాగా, ఇవాళ బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తుండడంతో ఈ ప్రచారం అంతా వట్టిదేనని తేలిపోయింది.

First Published:  15 Nov 2023 6:09 AM GMT
Next Story