Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసు.. రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వైఎస్ సునీత వ్యక్తం చేసిన అనుమానాలను సీబీఐ కూడా తన వాదనల సందర్బంగా సమర్ధించింది. సునీతా చెబుతున్న పరిస్థితులన్నీ నిజమేనని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

వివేకా హత్య కేసు.. రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X


వైఎస్‌ వివేకానందరెడ్డి హ‌త్య కేసు దర్యాప్తును మరో రాష్ట్ర పరిధిలోకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును వైఎస్‌ వివేకా కుమార్తె వైఎస్ సునీత కోరారు. సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సునీత తరపు న్యాయవాది వాదనల సందర్బంగా కీలక అంశాలను ప్రస్తావించారు.

సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులో ప్రధానంగా మూడు అంశాలున్నాయన్న సునీత తరపు న్యాయవాది.. ఈ కేసులో రాజకీయ జోక్యం మితిమీరి ఉందని కోర్టుకు వివరించారు. దర్యాప్తును తీవ్రస్థాయిలో ప్రభావితం చేసేందుకు స్థానిక ఎంపీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో ప్రైవేట్ కేసులు పెడుతూ సీబీఐ విచారణ అధికారిని కూడా భయపెడుతున్నారని కోర్టుకు విన్నవించారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారని వివరించారు. కాబట్టి ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచార‌ణ‌ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును సునీత కోరారు. కాలపరిమితితో కూడిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సస్పెండ్ అయిన అప్పటి స్థానిక సీఐ శంకరయ్య తొలుత సీబీఐ ముందు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు అంగీకరించారని..కానీ ఆయనకు ప్రభుత్వం తిరిగి పోస్టింగ్‌ ఇచ్చి ప్రమోషన్ కూడా ఇచ్చిందని, దాంతో సదరు అధికారి కూడా సీబీఐకి ఎదురు తిరిగిన పరిస్థితి ఉందని వివరించారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చూపిన ప్రభావమేనని చెప్పారు.

వైఎస్ సునీత వ్యక్తం చేసిన అనుమానాలను సీబీఐ కూడా తన వాదనల సందర్బంగా సమర్ధించింది. సునీతా చెబుతున్న పరిస్థితులన్నీ నిజమేనని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వాదనల సమయంలో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరాలు లేకుండా కోర్టుకు రావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అధికారులను ఆన్‌లైన్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించింది. కేసు వివరాలను అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నిందితులుగా ఉన్న వారు పదేపదే అనారోగ్యం పేరుతో ఆస్పత్రులకు వస్తూ అక్కడే దర్బార్‌ నిర్వహిస్తున్నారని సునీత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ సందర్భంలో సీబీఐపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హత్య జరిగి ఇన్నేళ్లు అవుతోందని, దర్యాప్తు పూర్తికి ఇంకా ఎంతకాలం కావాలంటూ సీబీఐని ప్రశ్నించింది. సాక్షుల‌కు ప్రమాదం పొంచి ఉన్న ఈకేసును సీబీఐ ఎందుకు త్వరగా తేల్చకుండా జాప్యం చేస్తోందని ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన సీబీఐ.. దర్యాప్తు పూర్తికి మరో ఆరు నెలల సమయం ఇవ్వాలని.. దర్యాప్తు ముందుకెళ్లకుండా సీబీఐ అధికారులపైనే నిందితులు ప్రైవేట్ కేసులువేయిస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

సాక్షులకు వన్‌ ప్లస్ వన్‌ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు చెప్పగా.. సరైన భద్రత కల్పిస్తున్నారన్న దానికి ఆధారాలుచూపాలని కోరింది. అందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ చెబుతున్న వివరాలను చూసినా, పిటిషనర్‌ వైఎస్ సునీత చెబుతున్న అంశాలను పరిశీలించినా.. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును బదిలీ చేస్తే తెలంగాణకు ఇవ్వాలా..? మరో రాష్ట్రానికి బదిలీ చేయాలా అన్న దానిపై కోర్టులో చర్చ జరిగింది.

తెలంగాణకు బదిలీ చేయడం వల్ల పెద్దగా తేడా ఉండదని.. కడపలో విచారించినా హైదరాబాద్‌లో విచారించినా పరిణామాలు ఒకేలా ఉంటాయని సీబీఐ న్యాయవాది కోర్టుకు వివరించారు. కాబట్టి తెలంగాణకు కాకుండా మరో రాష్ట్రానికి కేసును బదిలీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అన్నిపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ కేసులో శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది.

First Published:  19 Oct 2022 7:41 AM GMT
Next Story