Telugu Global
Andhra Pradesh

ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల.. ప్రకటన ఎప్పుడంటే.!

తెలంగాణలో YSR తెలంగాణ పేరుతో పార్టీ పెట్టారు ష‌ర్మిల‌. అయితే తర్వాత అసెంబ్లీ ఎన్నికల వేళ.. పోటీ నుంచి తప్పుకున్న షర్మిల కాంగ్రెస్‌ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు.

ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల.. ప్రకటన ఎప్పుడంటే.!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పదవికి రాజీనామా చేశారు గిడుగు రుద్రరాజు. ఈ మేరకు AICC చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. గిడుగు రాజీనామాతో కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు లైన్ క్లియర్‌ అయినట్లయింది. వీలైనంత త్వరగా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ పోస్టుపై షర్మిలకు ఇప్పటికే అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో హైకమాండ్‌ ఆదేశాల మేరకే గిడుగు పీసీసీ పోస్టుకు రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు.

తెలంగాణలో YSR తెలంగాణ పేరుతో పార్టీ పెట్టారు ష‌ర్మిల‌. అయితే తర్వాత అసెంబ్లీ ఎన్నికల వేళ.. పోటీ నుంచి తప్పుకున్న షర్మిల కాంగ్రెస్‌ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో షర్మిల పోటీ చేస్తారని.. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసేందుకు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లిన షర్మిల ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆదివారం మణిపూర్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభోత్సవంలో షర్మిల పాల్గొన్నారు.

ప్రస్తుతం షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జగన్‌, రేవంత్‌, చంద్రబాబు, మల్లు భట్టి విక్రమార్క, హరీష్‌ రావు లాంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. ఈ పెళ్లి తర్వాత ఏపీ రాజకీయాల్లో షర్మిల క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  15 Jan 2024 12:04 PM GMT
Next Story