Telugu Global
Andhra Pradesh

బీజేపీ తీరుపై వైఎస్ జగన్‌ది వ్యూహాత్మక మౌనమేనా?

బీజేపీ జాతీయ నాయకులు వైఎస్ జగన్, వైసీపీతో స్నేహం కొనసాగిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ప్రతిపక్షం లాగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయినా సరే వైఎస్ జగన్ ఏనాడూ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. టీడీపీ, జనసేన వైపు బీజేపీ చూస్తోందని వైఎస్ జగన్ గ్రహించినా.. మౌనంగానే ఉంటున్నారు.

బీజేపీ తీరుపై వైఎస్ జగన్‌ది వ్యూహాత్మక మౌనమేనా?
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం పొత్తులు కుదుర్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు మౌనంగా ఉన్న టీడీపీ.. వారం రోజులుగా బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తోంది. తెలంగాణలోని మునుగోడు పర్యటనకు వచ్చిన అమిత్ షా.. ఆ తర్వాత రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్‌లతో భేటీ కావడంతో ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు వచ్చింది. బీజేపీ-టీడీపీకి పొత్తు కుదర్చడానికే చంద్రబాబు తరపున రామోజీ మాట్లాడారంటూ వాళ్ల అనుకూల మీడియా వార్తలు రాస్తోంది. అసలు ఫిల్మ్ సిటీలో ఏం జరిగిందో ఇప్పటి వరకు కచ్చితంగా ఎవరికీ తెలియదు. జూనియర్ ఎన్టీఆర్‌తో నోవాటెల్ ముచ్చటేమిటో కూడా బీజేపీ వర్గాలు చెప్పడం లేదు. అయినా సరే.. పొత్తు కుదిరింది అంటూ పచ్చ మీడియా కోడై కూస్తోంది.

తాజాగా ఓ జాతీయ దినపత్రికలో.. టీడీపీ త్వరలోనే ఎన్డీయేలో చేరబోతోందని, దీనికి ముహూర్తం కూడా ఖరారయ్యిందంటూ ఒక కథనం వచ్చింది. టీడీపీనే కావాలని ఆ స్టోరీని ప్రింట్‌ చేయించిందనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సదరు కథనాన్ని పట్టుకొని తెలుగుదేశం అనుకూల న్యూస్ ఛానల్స్ కూడా ఎన్టీయేలో మళ్లీ టీడీపీ చేరుతుందని వార్తలు ప్రసారం చేశాయి. ఈ వార్త వాస్తవమో కాదో అప్రస్తుతం. కానీ వారం రోజులుగా మీడియాలో ఇంత హడావిడి జరుగుతున్నా వైసీపీ వైపు నుంచి ఒక్క వ్యాఖ్య లేదు. సీఎం వైఎస్ జగన్ కూడా దీనిపై కామెంట్లు ఏమీ చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మూడు పార్టీలు కలిసినా వైసీపీని ఓడించలేక పోయాయని జగన్ ప్రస్తావించేవారు. బీజేపీని కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని విమర్శించేవారు.

కానీ, రాను రానూ పరిపాలనలో ఉన్న ఇబ్బందులు జగన్‌కు అర్థం అయ్యాయి. కేంద్రంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తే రాష్ట్రాన్ని పాలించడం తెలుసుకున్నారు. ఎన్టీయేలో చేరకపోయినా.. బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. కీలకమైన బిల్లుల ఓటింగ్, రాష్ట్రపతి ఎన్నిక సమయంలో వైసీపీ బేషరతుగా మద్దతు తెలిపింది. బీజేపీ జాతీయ నాయకులు వైఎస్ జగన్, వైసీపీతో స్నేహం కొనసాగిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ప్రతిపక్షం లాగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయినా సరే వైఎస్ జగన్ ఏనాడూ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. టీడీపీ, జనసేన వైపు బీజేపీ చూస్తోందని వైఎస్ జగన్ గ్రహించినా.. మౌనంగానే ఉంటున్నారు.

పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే తప్పని బాహాటంగా చెప్పారు. వాళ్లు సహాయం చేస్తేనే తాను పరిహారం ఇవ్వగలరని బంతిని బీజేపీ కోర్టులో వేశారు. కానీ, రాజకీయ పరమైన విమర్శలు మాత్రం చేయడం లేదు. వారం రోజులుగా టీడీపీ మీడియా లీకులు ఇస్తున్నా.. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అధినేత జగన్ నుంచి వచ్చిన ఆదేశాల కారణంగానే వైసీపీ మంత్రులు, నాయకులు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరో రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాల్సి ఉంది. అసలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీకి కేంద్రం నుంచి వచ్చే నిధులే ఆసరా. ఇలాంటి సమయంలో కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి దిగితే కష్టమని జగన్‌కు తెలుసు. పక్కన ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. తెలంగాణకు రావల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ధనిక రాష్ట్రం అవడంతో తెలంగాణ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. కానీ ఏపీ విషయంలో పరిస్థితి వేరు. వైఎస్ జగన్ అనేక పథకాల ద్వారా ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ డబ్బు పంపిణీ తనను మళ్లీ అధికారంలోకి తెస్తుందని జగన్ భావిస్తున్నారు. బీజేపీతో గొడవలకు దిగి.. నిధులు ఆగిపోతే.. మొదటికే మోసం వస్తుంది.

రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, నిర్వాసితుల ప్యాకేజీ.. ఇలా అనేక కారణాల వల్లే వైఎస్ జగన్ మౌనంగా ఉంటూ.. పార్టీ నాయకుల నోర్లు కూడా మూయించినట్లు తెలుస్తోంది. అయినా, మీడియాలో వచ్చే వార్తలకు స్పందించడం కూడా తొందర పాటు అవుతుందని.. ఎన్టీయేలో టీడీపీ ఇప్పటికిప్పుడు చేరినా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేనది జగన్ భావిస్తున్నారు. ఎన్నికల వరకు ఈ పొత్తులపై మాట్లాడకపోవడమే మంచిదని జగన్ సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అందుకే మౌనంగా తన పని తాను చేసుకొని పోతున్నట్లు వైసీపీ నాయకులు అంటున్నారు. అమిత్ షా ఎవరిని కలిస్తే తనకేంటని.. తన పనేదో తాను చేసుకొని వెళ్లడమే మంచిదని జగన్ అనుకోవడం, ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన వ్యూహాత్మక మౌనం పాటించడం సరైన నిర్ణయమే అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

First Published:  28 Aug 2022 1:06 PM GMT
Next Story