Telugu Global
Andhra Pradesh

సచివాలయ వ్యవస్థ కోసం ఆర్డినెన్స్ జారీ

గ్రామ, వార్డు సచివాలయాల్లో అందే ప్రభుత్వ సేవలు, సచివాలయాలు జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడినవిగా చెల్లుబాటు అయ్యేందుకు ఈ ఆర్డినెన్స్ దోహదం చేస్తుంది.

సచివాలయ వ్యవస్థ కోసం ఆర్డినెన్స్ జారీ
X

జగన్‌ ఆలోచన నుంచి పుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు మరింత భద్రత కల్పించే చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్‌ తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయ చట్టం కూడా ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందే ప్రభుత్వ సేవలు, సచివాలయాలు జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడినవిగా చెల్లుబాటు అయ్యేందుకు ఈ ఆర్డినెన్స్ దోహదం చేస్తుంది. ఈ వ్యవస్థలోని ఉద్యోగుల సర్వీసు అంశాలను కూడా ఆర్డినెన్స్‌లో చేర్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఒక సరికొత్త అధ్యయనంగా భావిస్తారు. ఈ వ్యవస్థ కోసం ఒకేసారి లక్షా 34వేల మందిని శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. 2019అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్బంగా ఈ వ్యవస్థకు ప్రారంభమైంది. గ్రామాల్లో ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 15వేల 4 సచివాలయాలు పనిచేస్తున్నాయి.

ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. సచివాలయాల ద్వారా 545 రకాల ప్ర‌భుత్వ సేవలను ప్రజలు తమ సమీపంలోనే అందుకోగలుగుతున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా సమస్యల పరిష్కారం, సేవల అందజేత జరిగింది. ఇలాంటి వ్యవస్థకు మున్ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకే న్యాయ నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.

First Published:  13 Dec 2022 2:38 AM GMT
Next Story