Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్ టార్గెట్ ఆ 19 నియోజకవర్గాలే.!

టీడీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. 2024లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరాలని టార్గెట్ పెట్టారు.

వైఎస్ జగన్ టార్గెట్ ఆ 19 నియోజకవర్గాలే.!
X

ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది. సుదీర్ఘ పాదయాత్ర చేసి వైఎస్ జగన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీని అందుకున్నారు. దీంతో ఈ సారి 175 నియోజకవర్గాలకు గాను అన్నింటిలో విజయం సాధించాలని పార్టీ ప్లీనరీతో పాటు పలు సందర్భాల్లో చెబుతున్నారు. అయితే జగన్ అసలు టార్గెట్ మాత్రం 19 నియోజకవర్గాలని పార్టీలోని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లను గెలుచుకుంది. అయితే ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వైసీపీలో చేరితే సాంకేతికంగా వారి సభ్యత్వం రద్దవుతుందనే కారణంతో.. వాసుపల్లి గణేష్(విశాఖ సౌత్), వల్లభనేని వంశ (గన్నవరం), కరణం బలరాం( చీరాల), మద్దాలి గిరిధర్ రావు (గుంటూరు వెస్ట్ ) ఏ పార్టీలో చేరలేదు. కానీ వీరంతా రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక మిగిలిన 19 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2024లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరాలని సీఎం వైఎస్ జగన్ టార్గెట్ పెట్టారు. అయితే అది అంత సులభమేమీ కాదు. ఈ 19 నియోజకవర్గాల్లో టీడీపీ తరపున బలమైన నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు (కుప్పం), అచ్చెన్నాయుడు (టెక్కలి), గంటా శ్రీనివాసరావు (విశాఖపట్నం నార్త్), నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్ ), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ ), నందమూరి బాలకృష్ణ (హిందూపురం) వంటి సీనియర్ నాయకులను ఓడించడానికి వైసీపీ తమ పూర్తి శక్తిని, వనరులను వాడాల్సిందే. అందుకే టీడీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

టీడీపీ బలంగా ఉన్న ఆ నియోజకవర్గాలను ప్రత్యేకంగా టార్గెట్ చేసి.. క్షేత్రస్థాయి నాయకులను వైపీపీ వైపు మరలించే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో ఇలాంటి వ్యూహాన్నే అమలు చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు, కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. ఇక మిగిలిన టీడీపీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓటు బ్యాంకు పెంచే ప్రయత్నం చేయాలని వైఎస్ జగన్ సూచిస్తున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఎక్కువగా గెలుచుకున్న సీట్లు వైజాగ్‌లోనే ఉన్నాయి. ఆ నగరంలోని నాలుగు సీట్లు కూడా టీడీపీ గెలుచుకుంది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ టీడీపీ స్వీప్ చేసింది. అయితే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి రాజీనామా చేశారు. కానీ ఇటీవల ఆయన వైసీపీతో కూడా అంటీ ముట్టనట్లు ఉన్నారు. కానీ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగు వైసీపీ ఖాతలో పడేయడానికి జగన్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఏపీకి పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించారు. ఎన్నికలు మరో ఏడాదిన్నర‌లో రాబోతున్నాయి. ఈ లోగా విశాఖకు పరిపాలనా రాజధాని హోదాను కన్ఫార్మ్ చేస్తే ఆ నాలుగు నియోజకవర్గాలతో పాటు ఉత్తరాధ్రంలోని మిగిలిన సెగ్మెంట్లు కూడా వైసీపీకి అనుకూలంగా మారతాయని అంచాన వేస్తున్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడిని ఓడించేందుకు కూడా విశాఖ రాజధాని వ్యూహం కొంచెం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ ఖాతాలో ఉన్న ఇచ్చాపురం, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్ ,పెద్దాపురం, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పాలకొల్లు, ఉండి, విజయవాడ ఈస్ట్, రేపల్లె, అద్దంకి, చీరాల, కొండపి, ఉరవకొండ, హిందూపురం, పర్చూరు నియోజకవర్గాల్లో కూడా ఎప్పటికప్పుడు బలమైన నాయకులను వైసీపీలో చేర్చుకుంటున్నారు.

పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ, హిందూపురం కోసం ఇంచార్జీలను నియమించడమే కాకుండా.. సోషల్ మీడియా కోసం ప్ర‌త్యేకంగా కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు. వైసీపీకి అనుకూలంగా మారే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 175 సీట్లను క్వీన్ స్వీప్ చేయాలని వైఎస్ జగన్ చెబుతున్నా.. అది కష్టమేనని వైసీపీ నాయకులకు కూడా తెలుసు. పైగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అభ్యర్థిని మార్చడం ద్వారా ఆ వ్యతిరేకతను తగ్గించుకోవాలని వైఎస్ జగన్ అనుకుంటున్నారు. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతే తగ్గే సీట్లను.. టీడీపీ సిట్టింగ్‌లను ఓడించడం ద్వారా భర్తీ చేయాలని వ్యూహం రచించారు. పలు సర్వేల్లో పార్టీ గెలుస్తుందని చెబుతున్నా.. సీట్లు మరీ తక్కువగా చూపిస్తున్నారు. గతంలో కంటే సీట్లు తగ్గితే ప్రతిపక్షం బలపడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ప్రతిపక్షాన్ని బలహీనంగా ఉంచేలా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

First Published:  30 Aug 2022 9:19 AM GMT
Next Story