Telugu Global
Andhra Pradesh

ఏడాది చివరికల్లా లబ్దిదారులకు 1.10 లక్షల ఇళ్లు అందించాలి : సీఎం వైఎస్ జగన్

శానిటేషన్‌తో పాటు మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణపై అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏడాది చివరికల్లా లబ్దిదారులకు 1.10 లక్షల ఇళ్లు అందించాలి : సీఎం వైఎస్ జగన్
X

డిసెంబర్ చివరి కల్లా 1,10,672 టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ గృహ నిర్మాణంపై ఆయన బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 40,576 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించినట్లు తెలిపారు. అలాగే మార్చి లోగా మరో 1,10,968 ఇళ్లను అప్పగిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఫేజ్-1కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని అధికారులు సీఎం జగన్‌కు చెప్పారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణం కోసం రూ. 5,005 కోట్లు ఖర్చు చేశామని, విశాఖపట్నంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. లబ్దిదారులకు అందజేస్తున్న ఇళ్ల నిర్వహణ బాగుండాలని, వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికివాడలుగా తయారయ్యే ప్రమాదం ఉందని సీఎం జగన్ హెచ్చరించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుదీకరణ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఆ పనులన్నీ సమాంతరంగా సాగుతున్నట్లు అధికారులు చెప్పారు.

శానిటేషన్‌తో పాటు మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణపై అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్వహణ, మార్గదర్శకాలను వారికి వివరిస్తున్నట్లు తెలిపారు. కాగా, అధికారులు చెప్పిన సమాధానాలపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు జోగి రమేశ్, ఆదిపూలప్ సురేశ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

First Published:  26 Oct 2022 1:24 PM GMT
Next Story