Telugu Global
Andhra Pradesh

లోపల నే లవ్ చేసే అమ్మాయి ఉంది.. చెయ్యి ఎత్తితే బస్సు ఆపవా? .. డ్రైవర్ మెడపై కత్తి పెట్టి..

బస్సు ఆపాలని చెయ్యి ఎత్తినా డ్రైవర్ పట్టించుకోకపోవడంతో అతడిపై శివసాయి కోపం పెంచుకున్నాడు. ఇవాళ ఎలాగైనా ఆ బస్సును ఆపాలని నిర్ణయించుకున్నాడు.

లోపల నే లవ్ చేసే అమ్మాయి ఉంది.. చెయ్యి ఎత్తితే బస్సు ఆపవా? .. డ్రైవర్ మెడపై కత్తి పెట్టి..
X

సినిమాల ప్రభావమో లేకపోతే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు కానీ, ఇటీవల యువతలో సైకోయిజం బాగా పెరిగిపోయింది. లవ్ కి నో చెబితే నరకడం, ఒకవేళ ఎస్ చెప్పి పెళ్లి చేసుకోమంటే చంపడం వంటి పనులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓ యువకుడు తాను ఇష్టపడే అమ్మాయి రోజూ కాలేజ్ బస్సులో వెళుతోందని, ఆ అమ్మాయితో మాట్లాడాలని ఏకంగా కాలేజీ బస్సును ఆపే ప్రయత్నం చేశాడు. బస్సు ఆపలేదని మరుసటి రోజు రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టి మరీ బస్సు ఆపి ఎందుకు ఆపలేదంటూ డ్రైవర్ మెడపై కత్తి పెట్టాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.

శివసాయి అనే యువకుడు ఓ యువతిని ఇష్టపడుతున్నాడు. రోజూ ఆ అమ్మాయి కాలేజీ బస్సులో వెళ్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని పరిచయం చేసుకుని ఎలాగైనా మాట్లాడాలని శివసాయి నిన్న బస్సు ఆపడానికి ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ ఇదేమీ పట్టించుకోకుండా సరాసరి బస్సును కాలేజీ వద్దకు తీసుకెళ్లాడు.

బస్సు ఆపాలని చెయ్యి ఎత్తినా డ్రైవర్ పట్టించుకోకపోవడంతో అతడిపై శివసాయి కోపం పెంచుకున్నాడు. ఇవాళ ఎలాగైనా ఆ బస్సును ఆపాలని నిర్ణయించుకున్నాడు. రోజులాగే ఇవాళ ఉదయం కాలేజ్ బస్సు వెళుతుండగా కసింకోట మండలం బయ్యవరం వద్ద బస్సును తన బైక్ తో శివ సాయి ఓవర్ టేక్ చేశాడు. బస్సు ముందుకు వెళ్లి రోడ్డుకు అడ్డంగా బైక్ నిలిపాడు. దీంతో డ్రైవర్ బస్సును ఆపాడు.

డ్రైవర్ వద్దకు వచ్చిన శివసాయి ఉన్నట్టుండి తన వద్ద ఉన్న కత్తిని తీసి అతడి మెడపై పెట్టాడు. నిన్న తాను బస్సు ఆపినా ఎందుకు పట్టించుకోలేదు..? అంటూ ప్రశ్నించాడు. ఊహించని ఈ పరిణామంతో డ్రైవర్ బిత్తర పోయాడు. ఈ సంఘటన చూసి బస్సులోని అమ్మాయిలందరూ భయంతో గట్టిగా కేకలు పెట్టారు. అయితే బస్సులో శివసాయి ఇష్టపడే అమ్మాయి లేకపోవడంతో కొద్దిసేపటి తర్వాత అతడు బస్సు దిగి వెళ్ళిపోయాడు. జరిగిన ఘటనపై బస్సు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శివసాయిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First Published:  24 Feb 2023 9:07 AM GMT
Next Story