Telugu Global
Andhra Pradesh

ఎల్లోమీడియాకు బాబు దొరికాడా..?

ఎంఎస్ బాబుకు టికెట్ నిరాకరిస్తే దళితులందరినీ అవమానించినట్లనే ఎమ్మెల్యే ఆరోపణలకు అర్థ‌మేలేదు. ఓడిపోతున్నారని ప్రచారంలో ఉన్న ఓసీలను ఎలా కంటిన్యుచేస్తారని ఎమ్మెల్యే జగన్ను నిలదీయటంలో కూడా అర్థంలేదు.

ఎల్లోమీడియాకు బాబు దొరికాడా..?
X

కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ఎల్లోమీడియాకు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దొరికారు. జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరు దొరుకుతారా అని ఎల్లోమీడియా 24 గంటలూ 365 రోజులు ఎదురుచూస్తుంటుంది. అలాంటి మీడియాకు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఎంఎస్ బాబు లడ్డులా దొరికారు. ఇంకేముంది ఫస్ట్ పేజీలో ఎమ్మెల్యే అక్కసంతా వేసేశారు. జగన్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు బాగా ప్రాధాన్యతిచ్చారు. ‘దళితులుగా పుట్టడం నేరమా’ అని ఎమ్మెల్యే జగన్ను నిలదీసినట్లుగా పెద్ద అక్షరాలతో రాసుకుని తృప్తిపడిపోయింది.

రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటంలేదన్న జగన్ మాటలు పట్టుకుని ఎమ్మెల్యే చాలా మాట్లాడారు. టికెట్ దక్కటంలేదంటే ఎవరికైనా బాధుంటుందనటంలో సందేహంలేదు. అయితే ఆ బాధలో అసంబద్ధమైన మాటలు చాలామాట్లాడారు. అవేమిటంటే.. దళితుడిగా పుట్టడం నేరమా..? అని అడిగారు. అసలు ఇక్కడ దళితుడు అన్న ప్రస్తావన ఎందుకొచ్చింది. ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినంత మాత్రాన జగన్ దళితులకు అన్యాయం చేసినట్లు ఎలాగవుతుంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఎంఎస్ బాబు కాకపోతే మరో దళితనేత పోటీచేస్తాడు అంతేకాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే పోటీచేయలేరు కదా.

ఎంఎస్ బాబుకు టికెట్ నిరాకరిస్తే దళితులందరినీ అవమానించినట్లనే ఎమ్మెల్యే ఆరోపణలకు అర్థ‌మేలేదు. ఓడిపోతున్నారని ప్రచారంలో ఉన్న ఓసీలను ఎలా కంటిన్యుచేస్తారని ఎమ్మెల్యే జగన్ను నిలదీయటంలో కూడా అర్థంలేదు. ఎందుకంటే.. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, మల్లాది విష్ణు, జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పీవీ సిద్ధారెడ్డి, అన్నా రాంబాబు ఓసీలు కారా..? ఇంకెంతమందికి టికెట్లు నిరాకరిస్తారో తెలీదు.

ఇప్పుడు టికెట్ ఇవ్వనందుకు ఇంత గోలచేస్తున్న ఎంఎస్ బాబు 2019లో టికెట్ ఇచ్చినప్పుడు పోటీపడిన వారిలో తనకే ఎందుకు టికెట్ ఇచ్చారని జగన్ను అడిగారా..? అప్పుడు ఎందుకు టికెట్ ఇచ్చారని ఇప్పుడు అడగటం కాదు ఈ విషయాన్ని అప్పుడే అడిగుండాలి. టికెట్ ఇచ్చినప్పుడేమో జగన్ దేవుడు నిరాకరిస్తే దెయ్యమా..? గెలుపు ప్రాతిపదికగా ఎంఎస్ బాబుకే కాదు మరికొందరు ఎస్సీలకు కూడా టికెట్లు ఇవ్వలేదు. ఇంకొందరి నియోజకవర్గాలను మార్చిన విషయం ఎమ్మెల్యేకి తెలీదా..? తన నియోజకవర్గంలో రెడ్డిగార్ల పెత్తనమే సాగిందని ఇప్పుడు చెబుతున్న ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఎప్పుడైనా ఫిర్యాదుచేశారా..? మొత్తానికి కొద్దిరోజులు ఎల్లోమీడియాకు పండగే.

First Published:  3 Jan 2024 4:46 AM GMT
Next Story