Telugu Global
Andhra Pradesh

సమ్మిట్‌పై రగిలిపోతున్న ఎల్లో మీడియా

రాష్ట్రం నాశనమైపోయినా పర్వాలేదు జగన్ హయాంలో ఒక్క పెట్టుబడి కూడా రాకూడదన్నదే ధ్యేయంగా పెట్టుకుంది. ఇందుకనే పూర్తి వ్యతిరేక కథనాలను వండివారుస్తోంది.

సమ్మిట్‌పై రగిలిపోతున్న ఎల్లో మీడియా
X

పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైజాగ్‌లో రెండు రోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తోంది. శుక్ర, శనివారాల్లో జరగబోతున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు సుమారు 20 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 45 దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు వస్తున్నారు. రూ. 2 లక్షల కోట్ల పెట్టుబుడుల ను సాధించాలని ప్రభుత్వం టార్గెట్‌ గా పెట్టుకుంది. ఇవంతా ప్రయత్నాలు, అందుకు చేసిన ఏర్పాట్లు మాత్రమే.

ఈ ప్రయత్నాలనే ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా సరే సదస్సు ఫెయిల్ అవ్వాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా అక్కడి మీడియా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంది. సదస్సు ఏర్పాట్ల గురించి, పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై సానుకూలంగా వార్తలు, కథనాలు ఇస్తుంది. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. రాష్ట్రం నాశనమైపోయినా పర్వాలేదు జగన్ హయాంలో ఒక్క పెట్టుబడి కూడా రాకూడదన్నదే ధ్యేయంగా పెట్టుకుంది. ఇందుకనే పూర్తి వ్యతిరేక కథనాలను వండివారుస్తోంది.

‘సేఫేనా..రావచ్చా’ అనే హెడ్డింగ్‌తో పెద్ద నెటిగివ్ కథనాన్ని అచ్చేసింది. ఏపీకి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడిపోతున్నారట. నాలుగేళ్ళు పరిశ్రమలను తరిమేసి చివరి ఏడాదిలో రండి రండి పెట్టుబడులు పెట్టండంటే ఎవరొస్తారని పారిశ్రామికవేత్తలు అనుకుంటున్నారట. పరిశ్రమలు పెట్టేవాళ్ళతో అధికారపార్టీ వాళ్ళు వాటాలు అడుగుతున్నారని అమెరికాలోని ఒక ప్రవాసాంధ్ర‌ పారిశ్రామికవేత్త భయపడిపోతున్నారట. వైజాగ్ సమ్మిట్‌కు రావటానికి పారిశ్రామికవేత్తలు ఇష్టపడటంలేదట.

రాష్ట్రంలోని పరిస్థితులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వాకాబుచేస్తుంటే వాళ్ళేమో మీరే వచ్చి చూడండి అని చెప్పి తప్పించుకుంటున్నారంటు కథనాలు అచ్చేసింది. దీంతోనే అర్థ‌మైపోతోంది సదస్సు విజయవంతం అవబోతున్నట్లు. సమ్మిట్ సక్సెస్ అవుతుందని ఎల్లో మీడియా అనుకోబట్టే నెగిటివ్ కథనాలతో రెచ్చిపోతోంది. జగన్ ప్రభుత్వం తమను తరిమేసిందని ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఇంతవరకు చెప్పలేదు. తరిమేశారని, పారిపోయారని చంద్రబాబునాయుడు అండ్ కో+ఎల్లో మీడియా నాలుగేళ్ళుగా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ముందు ఇంత భారీఎత్తున ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షణకు సదస్సు నిర్వహించటం ఎల్లో గ్యాంగ్‌కు ఏమాత్రం రుచిస్తున్నట్లు లేదు. అందుకనే ఇంతలా విషం చిమ్ముతోంది. మరి సదస్సులో ఏ మేరకు పెట్టుబడులు వస్తాయో చూడాల్సిందే.

First Published:  3 March 2023 6:49 AM GMT
Next Story