Telugu Global
Andhra Pradesh

జగన్‌పై హిందువులను రెచ్చగొడుతోందా..?

లిక్కర్ వ్యాపారి ఆదికేశవుల నాయుడుని చంద్రబాబునాయుడు ట్రస్ట్ బోర్డుకు ఛైర్మన్ గా నియమించిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు..?

జగన్‌పై హిందువులను రెచ్చగొడుతోందా..?
X

జగన్మోహన్ రెడ్డిపై బురదజ‌ల్లుడు కార్యక్రమానికి ఎల్లోమీడియా మరో అంకానికి తెరలేపింది. రాజకీయంగా తాము రాసే కథనాలు, వార్తలను జనాలు పట్టించుకోవటంలేదని అర్థ‌మైనట్లుంది. అధికార దుర్వినియోగం అంటూ చేస్తున్న గోలను జనాలు లెక్కచేయటంలేదని తెలిసినట్లుంది. అందుకనే డైరెక్టుగా హిందువుల మనోభావాలపైకి దాడి మొదలుపెట్టింది. జగన్ కు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా పే....ద్ద కథనం అచ్చేసింది. ‘భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలివేటు’ అనే హెడ్డింగ్ లో జగన్ను కిరాతకుడిగా, రాక్షసుల వారసుడిగా బుర్రకు తోచినట్లుగా వర్ణించింది.

దేవాలయాలకు, హిందూ ధర్మానికి జగన్ తీరని అన్యాయం చేస్తున్నట్లు గోలగోలచేసింది. దేవాలయాల వ్యవహారాల్లో జగన్ తుచ్చ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు శాపనార్థాలు పెట్టింది. మొత్తంమీద ఎల్లోమీడియా చెప్పింది ఏమిటంటే.. హిందూ మతానికి జగన్ తీరని అపచారం చేస్తున్నాడు కాబట్టి వైసీపీకి ఓట్లు వేయకూడదని. కథనంలో తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం అప్పన్న, విజయవాడలోని కనకదుర్గ దేవాలయం, శ్రీశైలం దేవస్థానాల‌కు జగన్ చాలా చేటు చేసినట్లు రాసింది.

టీటీడీ ట్రస్టుబోర్డులో లిక్కర్ స్కామ్ లో నిందితుడు, జైలుకెళ్ళొచ్చిన శరత్ చంద్రారెడ్డిని నియమించటం ఏమిటని ప్రశ్నించింది. నిజమే.. ఈ విషయంలో జగన్ చేసింది తప్పే. కానీ లిక్కర్ వ్యాపారి ఆదికేశవుల నాయుడుని చంద్రబాబునాయుడు ట్రస్ట్ బోర్డుకు ఛైర్మన్ గా నియమించిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు..? అలాగే క్రిస్టియన్ అయిన ఎమ్మెల్యే వంగలపూడి అనితను బోర్డు సభ్యురాలిగా నియమించింది కూడా చంద్రబాబే కదా. ఓటుకునోటు కేసులో జైలుకు వెళ్ళొచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను బోర్డులో సభ్యుడిగా నియమించింది చంద్రబాబే కదా. శ్రీశైలం దేవస్థానం షాపులను అన్యమతస్తులకు చంద్రబాబు కేటాయించిన విషయాన్ని ఎల్లోమీడియా మరచిపోయిందా ?

దుర్గగుడికి జగన్ తీరని అపచారం చేసినట్లు రాసింది. అయితే చంద్రబాబు హయాంలో ఇదే దేవాలయంలో జరిగిన క్షుద్రపూజలను ఎల్లోమీడియా మరచిపోయినట్లుంది. అమ్మవారి దేవాలయంలో క్షుద్రపూజలు జరిపించటానికి మించిన అపచారం ఏముంటుంది. ఇక వివిధ దేవాలయాల్లో సేవల టికెట్ల ధరలను పెంచేయటం జగన్ చేసిన అపచారమట. భక్తులు ఇష్టముంటే టికెట్లను కొనుక్కుంటారు, లేకపోతే దర్శనం చేసుకుని వెళిపోతారు. చంద్రబాబు హయాంలో కూడా చాలా దేవాలయాల్లో సేవల టికెట్ల ధరలు పెరిగిన విషయాన్ని ఎల్లోమీడియా కావాలనే మరుగుపరిచింది. ధర్మపోరాట దీక్షలకు టీటీడీ డబ్బును వాడుకోవటం చంద్రబాబు దుర్వినియోగం చేసినట్లు కాదా..?

కథనం మొత్తంలో ఎల్లోమీడియా ఏడుపు ఏమిటంటే హిందూ ధర్మానికి జగన్ అపచారం చేస్తున్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎవరు ఓట్లేయద్దని చెప్పటమే. అంటే తన కథనంలో హిందువులపైకి ఎల్లోమీడియా సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించిందని అర్థ‌మైపోతోంది.

First Published:  4 Feb 2024 5:31 AM GMT
Next Story