Telugu Global
Andhra Pradesh

అదానీ వచ్చినా ఏడుపేనా?

ఇప్పుడు ఎల్లోమీడియా ఏడుపు ఏమిటంటే ఎన్నికలకు ముందు అదానీ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు ఏమైనా ప్రకటిస్తే వైసీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అయిపోతుందేమో అని.

అదానీ వచ్చినా ఏడుపేనా?
X

జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అవటాన్ని ఎల్లోమీడియా తట్టుకోలేపోతోందా? తాజా కథనం చూస్తే అదే అనుమానం పెరిగిపోతోంది. ‘అదానీకి జూ హుజూర్’ అనే హెడ్డింగ్‌తో ఒక కథనం అచ్చేసింది. అందులో అదానీ అమరావతికి వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు అనే సమాచారం అందించటం కన్నా అదానీ వచ్చి, వెళ్ళిన విధానంపైనే తన అక్కసును వెళ్ళగక్కింది. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగిన దగ్గర నుండి ప్రభుత్వం రాచమర్యాదలు చేసిందట.

గ్రీన్ ఛానల్లో ట్రాఫిక్ క్లియరెన్సు చేయించి మరీ తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు తీసుకువచ్చిందట. ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరంలేకపోయినా అదానీకి ప్రభుత్వం అమిత మర్యాద చేసిందని ఒకటే ఏడుపు. తాడేపల్లిలో జగన్ దంపతులతో అదానీ దాదాపు రెండు గంటలపాటు భేటీ అయ్యారట. భోజనం చేసిన తర్వాత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మళ్ళీ బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చెప్పింది.

ఎయిర్ పోర్టులో విమానం ఆగిన రన్ వే దాకా అదానీ కారును తీసుకెళ్ళారని ఒకటే గోల చేసింది. విమానం దాకా అదానీ కారు వెళ్ళిందంటే అందుకు జగన్‌కు ఏమి సంబంధం. విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఎల్లోమీడియాకు తెలియ‌దా? రన్ వే దాకా కారు వెళ్ళిందంటే కేంద్ర పౌరవిమనాయాన శాఖ క్లియరెన్స్ ఇచ్చుంటుంది. దానికి కూడా జగన్‌నే తప్పుపడితే ఎలా?

అదానీ రాక, భేటీ, పోక అంతా రహస్యంగానే ఉంచింది ప్రభుత్వం అని ఒకటే గోల. జగన్-అదానీ భేటీ ఫొటోలు విడుదలైన తర్వాత ఇందులో రహస్యం ఏముంది? అదానీ స్థాయి పారిశ్రామికవేత్తతో ముఖ్యమంత్రి భేటీ అయితే కచ్చితంగా వివరాలను తెలియజేయాలట. గతంలో చంద్రబాబుతో ఇదే అదానీ భేటీ అయినపుడు కూడా సింపుల్‌గా ఒక ఫొటో విడుదల చేసేవారంతే. అప్పట్లో కూడా అదానీకి ఇదే విధంగా మర్యాదలు జరిగాయి. భేటీపై ఎవరి ఊహాశక్తికి తగ్గట్లుగా వాళ్ళు రాసుకునేవారు. ఇప్పుడు ఎల్లోమీడియా ఏడుపు ఏమిటంటే ఎన్నికలకు ముందు అదానీ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు ఏమైనా ప్రకటిస్తే వైసీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అయిపోతుందేమో అని. అందుకనే ఈ ఏడుపులు, పెడబొబ్బలు.


First Published:  29 Sep 2023 5:50 AM GMT
Next Story