Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు ఎల్లో మీడియా షాక్

భావి నేత లోకేష్ పాదయాత్ర ఎందుకింత పేలవంగా జరుగుతోందో అర్థం కావటంలేదు. దాంతో చేసేదిలేక ఎల్లో మీడియా కూడా పాదయాత్ర వార్తలను లోపలపేజీల్లో వేస్తుంది. నిజంగా ఈ పరిణామం చంద్రబాబుకు షాకనే చెప్పాలి.

చంద్రబాబుకు ఎల్లో మీడియా షాక్
X

క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి జీవం పోస్తోంది ఎల్లో మీడియా మాత్రమే అని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు చేస్తున్న పోరాటం కన్నా చంద్రబాబును ముందుపెట్టి ఎల్లో మీడియా చేస్తున్న పోరాటమే చాలా ఎక్కువ. అలాంటిది నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళానికి ఎల్లో మీడియా ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ దానికి విరుద్ధంగా పాదయాత్ర వార్తలను ఎల్లో మీడియా లోపలి పేజీల్లో వేస్తోంది.

ఎల్లో మీడియానే లోకేష్ వార్తలను లోపలిపేజీల్లో వేస్తోందంటే అర్థ‌మేంటి? పాదయాత్ర ఎంత పేలవంగా జరుగుతోందో అర్థ‌మైపోతోంది. పాదయాత్ర మొదటిరోజు ఇంకేముంది లోకేష్ పాదయాత్రతో భూమి బద్దలైపోవటం ఖాయమన్నట్లుగా కవరేజి ఇచ్చింది. మరి మూడు రోజులు గడిచేసరికి వార్తలు లోపలి పేజీలకు ఎందుకు వెళ్లిపోయాయి? పాదయాత్రకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు కచ్చితంగా మొదటి పేజీలో ఉండేట్లుగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

అయితే యాత్రలో లోకేష్ మాట్లాడుతున్న విధానం, లేవనెత్తుతున్న అంశాలపై జనాల్లో ఆసక్తి కనబడటంలేదు. పైగా లోకేష్ మాటల్లో దొర్లుతున్నతప్పులను వైసీపీ సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తోంది. ఇదే సమయంలో జనాలు కూడా పెద్దగా కనబడకపోవటం, ఎవరు కూడా లోకేష్‌కు తమ సమస్యలను చెప్పుకుని వినతులను ఇవ్వకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పైగా పార్టీ స్థితిని, బలహీనతలను ద్వితీయశ్రేణి నేతలు పార్టీ మీటింగుల్లో ఎత్తి చూపుతున్నారు. దీన్నికూడా వైసీపీ బాగా వైరల్ చేస్తోంది. కొన్నిచోట్లయితే పాదయాత్రలో వంద మంది కూడా ఉండటంలేదు.

ఇక స్టేజి షోలు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మామూలుగా అయితే మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు దిట్టనే చెప్పాలి. ఏమీలేని చోట కూడా ఏదో ఉందని భ్రమల్లో ఉంచటంలో టీడీపీని మించిన పార్టీ లేదు. అలాంటిది భావి నేత లోకేష్ పాదయాత్ర ఎందుకింత పేలవంగా జరుగుతోందో అర్థంకావటంలేదు. దాంతో పై విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేసేదిలేక చివరకు ఎల్లో మీడియా కూడా పాదయాత్ర వార్తలను లోపలపేజీల్లో వేస్తున్నట్లుంది. నిజంగా ఈ పరిణామం చంద్రబాబుకు షాకనే చెప్పాలి.

First Published:  2 Feb 2023 6:16 AM GMT
Next Story