Telugu Global
Andhra Pradesh

'సిట్' విషయంలో ఎల్లో మీడియా డబుల్ గేమ్..

ఓ దశలో సిట్ సేకరించిన సమాచారాన్ని పొగిడిన ఎల్లో మీడియా.. మాచర్ల విషయంలో అనుమానాలున్నాయంటూ అధికారుల్ని తప్పుబట్టే ప్రయత్నం చేసింది.

సిట్ విషయంలో ఎల్లో మీడియా డబుల్ గేమ్..
X

ఎన్నికల అల్లర్లపై ఏపీ డీజీపీ నియమించిన 'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్' విషయంలో ఎల్లో మీడియా డబుల్ గేమ్ ఆడుతోంది. సిట్ లో ఉన్న వారంతా ఏసీబీ నుంచి వచ్చారని, ఏసీబీ తాజా బాస్, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అనుకూలంగా వారు పనిచేస్తారని కథనలిచ్చింది. అదే సమయంలో సిట్ ప్రాథమిక నివేదిక కూడా హైలైట్ చేస్తూ పోలీసుల వైఫల్యాలను వారు బయటపెట్టారని ప్రశంసించింది. 'సిట్' దర్యాప్తు విషయంలో ఎల్లో మీడియా డబుల్ గేమ్ ఆడుతుందనే విషయం నిర్థారణ అవుతోంది. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత టీడీపీ ఇబ్బందిపడితే, అధికారులపై నిందలు వేసే అవకాశాన్ని వదులుకోకూడదనే ఇలాంటి ఆర్టికల్స్ ఇస్తున్నారు.

తప్పెవరిది..?

'సిట్' ప్రాథమిక దర్యాప్తులో కొంతమంది పోలీస్ అధికారులు తప్పులు చేసినట్టు తేలింది. 6 నియోజకవర్గాల పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 33 కేసులను పరిశీలించిన సిట్ అధికారులు 150 పేజీల సమగ్ర నివేదికను డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు అందజేశారు. ఈ 33 కేసుల్లో 1,370 మంది నిందితులు కాగా వారిలో ఇప్పటివరకు 731 మందినే గుర్తించారని రిపోర్ట్ లో తేలింది. మరో 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉందని, మొత్తంగా 33 కేసుల్లో కేవలం 124 మందినే అరెస్టు చేశారనేది రిపోర్ట్ సారాంశం. అంటే ఇక్కడ స్థానిక పోలీసుల అలసత్వం ఉందని సిట్ తన నివేదికలో చెప్పినట్టయింది. ప్రస్తుతం ఈ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తుపై సిట్ పర్యవేక్షణ కూడా ఉంది.

ఓ దశలో సిట్ సేకరించిన సమాచారాన్ని పొగిడిన ఎల్లో మీడియా.. మాచర్ల విషయంలో అనుమానాలున్నాయంటూ అధికారుల్ని తప్పుబట్టే ప్రయత్నం చేసింది. మాచర్ల పట్టణంలో టీడీపీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, టీడీపీ నేతలు 10మంది గాయపడ్డారని, అలాంటి ప్రాంతానికి సిట్ సభ్యులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం సిట్ పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. సిట్ అధిపతి వినీత్ బ్రిజ్ లాల్ సమర్థుడైన అధికారిగా పేర్కొన్న వైసీపీ నేతలు.. పలు విషయాలపై ఆయనకు ఫిర్యాదు చేశారు.

First Published:  21 May 2024 2:22 AM GMT
Next Story