Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారా? ఎల్లో మీడియా షాక్

ఒక‌ప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి చివరకు ఇలా అయిపోయిందని ఎల్లో మీడియా తెగబాధపడింది. రాజకీయంగా చంద్రబాబు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే విశ్వసనీయత కోల్పోవటానికి ప్రధాన కారణమని కూడా తేల్చింది.

చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారా? ఎల్లో మీడియా షాక్
X

చంద్రబాబునాయుడుకు 24 గంటలూ.. 365 రోజులు కొమ్ముకాసే ఎల్లో మీడియానే గాలి తీసేసింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు స్పష్టంగా చెప్పింది. మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో చంద్రబాబు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల కారణంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ముందు చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయినట్లు ప్రతి ఆదివారం రాసే పలుకులో ఎల్లో మీడియా యాజమాన్యం తేల్చేసింది. జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయిందని బాధపడిపోయింది.

2019 ఎన్నికలకు ముందు బీజేపీతో శతృత్వంపెట్టుకుని తప్పుచేస్తే, ఇప్పుడు అదే బీజేపీతో చేతులు కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల మళ్ళీ నష్టపోతామని పార్టీలోని తమ్ముళ్ళే చంద్రబాబుతో చెబుతున్నారట. విచిత్రం ఏమిటంటే అప్పట్లో.. అంటే 2019 ఎన్నికలకు ముందు మోడీ పనైపోయిందని, మోడీతో కలిసుంటే ఇబ్బందులు తప్పవని ఇదే ఎల్లో మీడియా చంద్రబాబుకు చెప్పింది. సొంత ఆలోచనలను ఎప్పుడో కోల్పోయిన చంద్రబాబు ఎల్లో మీడియా పోరును భరించలేక బీజేపీతో తీవ్రంగా విభేదించారు.

అలాంటిది ఇప్పుడేమో అప్పట్లో బీజేపీని వ్యతిరేకించి చంద్రబాబు తప్పు చేశారని చెబుతోంది. తనపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్ర‌ధాని మోడీని చల్లబరచేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. ఏకకాలంలో ఇటు జగన్మోహన్ రెడ్డితో అటు మోడీతో తలప‌డే సీన్ చంద్రబాబుకు లేదని ఎల్లో మీడియా చెప్పేసింది. జగన్ బాధను తప్పించుకోవాలంటే మోడీ ముందు సాగిలపడక తప్పదని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. మోడీకి దగ్గరవ్వాలన్న ప్రయత్నాల్లో చంద్రబాబు ప్రతిపక్షాలన్నింటికీ దూరమయ్యారని చెప్పింది.

దీని ఫలితంగా చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీసుకుంటుందో లేదోకానీ ప్రతిపక్షాల్లో మాత్రం విశ్వసనీయత కోల్పోయినట్లు డిసైడ్ చేసింది. జగన్ దెబ్బను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లు పరోక్షంగా ఎల్లో మీడియా తేల్చేసింది. అమిత్ షాతో చంద్రబాబు భేటీపై వైసీపీ చేస్తున్న విమర్శలకు కూడా సరైన జవాబిచ్చే స్థితిలో చంద్రబాబు లేరట. ఒక‌ప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు పరిస్థితి చివరకు ఇలా అయిపోయిందని ఎల్లో మీడియా తెగబాధపడింది. రాజకీయంగా చంద్రబాబు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే విశ్వసనీయత కోల్పోవటానికి ప్రధాన కారణమని కూడా తేల్చింది. ఎంతో నమ్ముకున్న ఎల్లో మీడియానే తనకు విశ్వసనీయత లేదని సర్టిఫై చేయటాన్ని చంద్రబాబు ఎలా తట్టుకుంటారో ఏమో.

First Published:  11 Jun 2023 5:19 AM GMT
Next Story