Telugu Global
Andhra Pradesh

టీడీపీలో బుజ్జగింపులట.. వైసీపీలో మాత్రం తిరుగుబాటట

టీడీపీ, జనసేనలో అంతా హ్యాపీ అన్నట్లుగా కథనాలు ఇస్తోంది. ఏ పార్టీలో అయినా టికెట్లు రానినేతల్లో అసంతృప్తి సహజం. కొందరు నేతలు గొడవలు చేస్తారు,

టీడీపీలో బుజ్జగింపులట.. వైసీపీలో మాత్రం తిరుగుబాటట
X

ఎల్లోమీడియా పడుతున్న అవస్థ‌లు అంతా ఇంతా కాదు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటు సమయంలో నివురుగప్పిన నిప్పులాగున్న విభేదాలు, అసంతృప్తులు అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక్కసారిగా బద్దల‌య్యాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన తరఫున పోటీచేయబోయే 99 మంది అభ్యర్థుల మొదటిజాబితాను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అధినేతలు అభ్యర్థుల జాబితాలను అలా ప్రకటించారో లేదో రెండుపార్టీల్లోని నేతల మధ్య గొడవలు ఇలా రోడ్డున పడ్డాయి. వీళ్ళని బుజ్జగించేందుకు చంద్రబాబు, పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు.

ప్రకటించిన 99 నియోజకవర్గాల్లో కనీసం 25 నియోజకవర్గాల్లో గొడవలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. లిస్టులను ప్రకటించి మూడు రోజులవుతున్నా గొడవలు పెరుగుతున్నాయే కాని తగ్గటంలేదు. దాంతో అసంతృప్తనేతలను బుజ్జగింపుల పేరుతో నేతలను చంద్రబాబు బతిమలాడుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలను తగలబెట్టేశారు. చంద్రబాబు ఇంటిముందు పెట్రోలు, కిరోసిన్ బాటిళ్ళు, క్యాన్లతో నానా రచ్చ చేస్తున్నారు. ఇవేవి జనాల దృష్టిలో పడకుండా ఎలోమీడియా నానా అవస్థ‌లు పడుతోంది.

టీడీపీ, జనసేనలో అంతా హ్యాపీ అన్నట్లుగా కథనాలు ఇస్తోంది. ఏ పార్టీలో అయినా టికెట్లు రానినేతల్లో అసంతృప్తి సహజం. కొందరు నేతలు గొడవలు చేస్తారు, మరికొందరు తిరుగుబాట్లు చేస్తారు. తర్వాతెప్పుడో అధినేతల నుండి ఏవో హామీలు తీసుకుని చల్లబడతారు. కొందరు మాత్రమే పార్టీలు మారుతారు. వైసీపీలో టికెట్లు దక్కని సుమారు 25 మంది ఎమ్మెల్యేల్లో ఐదారుగురు మినహా ఇంకెవరూ గట్టిగా మాట్లాడలేదు. అలిగిన కొందరిని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరు ముగ్గురు ఎల్లోమీడియా మాయలో పడి జగన్ పైన నోటికొచ్చింది మాట్లాడినా, తర్వాత సర్దుకుని సారి చెప్పుకున్నారు. ముగ్గురు నలుగురు పార్టీ మారిపోయారు.

దాన్ని జగన్ పై ఎమ్మెల్యేల‌ తిరుగుబాటని ఫ్రంట్ పేజీల్లో పెద్ద హెడ్డింగులు అచ్చేసింది ఎల్లోమీడియా. వైసీపీలో గందరగోళం సృష్టించేందుకు తనకు చేతనైంతగా ప్రయత్నించింది. అయితే ఎంత ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనబడలేదు. మరిప్పుడు టీడీపీ, జనసేనలో జరుగుతున్నది ఏమిటి..? చంద్రబాబు, పవన్ మీద రెండుపార్టీల్లోని నేతల్లో కొందరు తిరుగుబాటు చేశారు. అభ్యర్థులను మార్చకపోతే ఓడిపోవటం ఖాయమని పీ.గన్నవరం, రాజమండ్రి రూరల్, ఉండి, నరసాపురం, తణుకు లాంటి నియోజకవర్గాల్లో గోలగోల చేస్తున్నారు. తక్కువ సీట్లు తీసుకున్నారని, ఓడిపోయే సీట్ల తీసుకున్నారని పవన్ పైన కూడా పార్టీలో నేతలు మండిపోతున్నారు. ఇవేవీ జనాలకు తెలీయకుండా ఎల్లోమీడియా నానా అవస్థ‌లు పడుతోంది.

First Published:  28 Feb 2024 4:58 AM GMT
Next Story