Telugu Global
Andhra Pradesh

ఇక్కడ వైసీపీకి గట్టి అభ్యర్థే లేరా ?

ఇప్పటికీ వైసీపీకి ఇక్కడ గట్టి అభ్యర్ధి దొరకటం లేదు. 2019లో దాసరి జై రమేష్‌ను పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పినా రమేష్ పోటీ చేయలేదు. మరి రేపటి ఎన్నికలో పోటీ చేస్తారో లేదో తెలీదు..

ఇక్కడ వైసీపీకి గట్టి అభ్యర్థే లేరా ?
X

వినటానికి ఇది ఆశ్చర్యంగానే ఉన్నా ఇదే నిజం. రాష్ట్రంలోని చాలా ముఖ్యమైన విజయవాడ పార్లమెంటు సీటులో వైసీపీకి గట్టి అభ్యర్ధే దొరకటంలేదు. ఇక్కడ పోటీ చేసిన రెండుసార్లు వైసీపీ ఓడిపోయింది. 2014లో కోనేరు ప్రసాద్ పోటీ చేస్తే .. 2019లో పొట్లూరి వరప్రసాద్ పోటీ చేశారు. ఇద్దరూ పారిశ్రామికవేత్తలే, బాగా డబ్బు ఖర్చుచేయగలిగిన వాళ్ళే. అయినా వైసీపీ ఓడిపోయింది. 2014లో అంటే ఏదోలే అనుకోవచ్చు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలి అంత బలంగా వీచినప్పటికీ విజయవాడ సీటులో ఎందుకు ఓడిపోయింది ?

రెండు వ‌రుస‌ ఎన్నికల్లో ఆర్ధికంగా బలమైన అభ్యర్ధులు ఓడిపోయారంటే ఎన్నికల్లో డబ్బు అవసరమే కానీ డబ్బే గెలిపిస్తుందని అనుకునేందుకు లేదని అర్ధమైంది. వైసీపీ తరపున పోటీ చేసిన ఇద్దరు పూర్తిగా పారిశ్రామికవేత్తలు మాత్రమే. వీళ్ళకు మామూలు జనాలతో ఎలాంటి సంబంధాలు లేవు. పోనీ ముందునుండి రాజకీయాల్లో ఉన్నారా అంటే అదీలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో టికెట్ తీసుకుని డైరెక్ట్‌గా ఎన్నికల్లోకి దిగిపోయారు. అదే రెండుసార్లు వరసగా గెలిచిన కేశినేని నాని కూడా వ్యాపారవేత్తే అయినప్పటికీ టీడీపీ తరపున జనాల్లోనే ఉన్నారు. అందుకనే జనాలు నానిని గెలిపించారు.

సరే గతం ఏదోలా గడచిపోయిందంటే మరి 2024 ఎన్నికల మాటేమిటి ? ఇప్పటికీ వైసీపీకి ఇక్కడ గట్టి అభ్యర్ధి దొరకటం లేదు. 2019లో దాసరి జై రమేష్‌ను పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పినా రమేష్ పోటీ చేయలేదు. మరి రేపటి ఎన్నికలో పోటీ చేస్తారో లేదో తెలీదు.. కానీ ఇప్పటికైతే గట్టి నేత లేరన్నది వాస్తవం. అందుకనే ఎమ్మెల్యేల‌లో ఎవరినైనా లేదా యువనేత దేవినేని అవినాష్ లేకుంటే మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి లాంటి వాళ్ళని పరిశీలిస్తున్నారట.

ఏదేమైనా విజయవాడలో ఎంపీగా గెలవకపోవటం వైసీపీకి పెద్ద లోటనే చెప్పాలి. ఎన్నికల్లో గెలుపోటములు దైవాదీనాలని అందరికీ తెలిసిందే. అయినా గెలిచేంత సత్తా ఉన్న ఎంపీ అభ్యర్ధిని వైసీపీ తయారు చేసుకోకపోవటం మాత్రం కచ్చితంగా జగన్ తప్పనే చెప్పాలి. విజయవాడ కీలకమైన పార్లమెంటు సీటు మొదటి నుండి వైసీపీకి అందనంత దూరంలోనే ఉంటుంది. మరి వచ్చేసారైనా ఈ లోటును పూడ్చుకుంటుందా?

First Published:  7 Oct 2022 1:29 PM GMT
Next Story