Telugu Global
Andhra Pradesh

ఇద్దరు పోటీపడి వైరల్ చేస్తున్నారా..?

టీడీపీ నేతలేమో పైన డైలాగు హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నేపథ్యంలో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే.

ఇద్దరు పోటీపడి వైరల్ చేస్తున్నారా..?
X

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలోని ఒక డైలాగును రెండు ప్రధాన పార్టీలు పోటీలు పడి వైరల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ డైలాగు ఏమిటంటే.. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ, ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు.. మార్చలేరు’ అని. బాలయ్య నటించిన సినిమా కాబట్టి, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి డైలాగుల్లో రాజకీయ వాసనలు ఉండటం సహజమే.

బాలయ్యంటే చంద్రబాబునాయుడుకి బావమరిది కమ్ వియ్యంకుడు కమ్ హిందుపురం ఎంఎల్ఏ కూడా. అందుకనే ఇదివరకటి సినిమాల్లో కూడా టీడీపీకి అనుకూలంగా కొన్ని డైలాగులున్నాయి. ఇదే పద్దతిలో రాబోయే సినిమాలో కూడా రాజకీయాలతో ముడిపడిన డైలాగులు పెట్టుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బాలయ్య డైలాగులంటే పూర్తిగా టీడీపీకి మద్దతుగా ఉండాలి. కానీ రిలీజవ్వబోయే సినిమాలోని పైన డైలాగ్ మాత్రం ఇటు టీడీపీ అటు వైసీపీ రెండూ పోటీలుపడి వైరల్ చేస్తున్నాయి.

టీడీపీ నేతలేమో పైన డైలాగు హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నేపథ్యంలో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే. కాబట్టి బాలయ్య డైలాగ్ జగన్ను ఉద్దేశించిందే అని తమ్ముళ్ళు ఆనందపడిపోతున్నారు. ఇదే సమయంలో ఇదే డైలాగును వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. బాలయ్య డైలాగును వైసీపీ ఎందుకు వైరల్ చేస్తోంది..?

ఎందుకంటే టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీని చంద్రబాబు లాగేసుకున్నారు కాబట్టే అని వైసీపీ వైరల్ చేస్తోంది. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ ఆరోగ్యసేవ-హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకంగా మార్చారు కాబట్టే అని చెబుతున్నారు. బాలయ్య చెప్పిన డైలాగు పై రెండు సందర్భాల్లో చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. మొత్తానికి ఒకటే డైలాగ్‌ను రెండుపార్టీల శ్రేణులు పోటీపడి మరీ వైరల్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

First Published:  8 Jan 2023 3:55 AM GMT
Next Story