Telugu Global
Andhra Pradesh

మాధవ్ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్..

ప్రస్తుతం మాధవ్ కంటే ఎక్కువగా వైసీపీ నాయకులు ఈ విషయంలో రియాక్ట్ అవుతున్నారు, స్పందించిన ప్రతిసారి ఏదో ఒక విషయంలో ప్రతిపక్షాలకు, ప్రతిపక్ష అనుకూల మీడియాకి టార్గెట్ అవుతున్నారు.

మాధవ్ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్..
X

గోరంట్ల మాధవ్ వీడియో బయటకు రావడంలో టీడీపీ ప్రమేయం ఉందో.. లేదో.. చెప్పలేం కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల విషయంలో మాత్రం వైసీపీ తనకు తానుగా టీడీపీ ఉచ్చులో పడిపోయింది. వైసీపీ నేతల వ్యాఖ్యలు, సర్దుబాట్లు, కవరింగ్ లు.. అన్నీ టీడీపీ అనుకున్నట్టుగానే సాగుతున్నాయి. మాధవ్ ని వెనకేసుకొచ్చే విషయంలో వైసీపీ పూర్తిగా సెల్ఫ్ గోల్ వేసుకుందనే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం మాధవ్ కంటే ఎక్కువగా వైసీపీ నాయకులు ఈ విషయంలో రియాక్ట్ అవుతున్నారు, స్పందించిన ప్రతిసారి ఏదో ఒక విషయంలో ప్రతిపక్షాలకు, ప్రతిపక్ష అనుకూల మీడియాకి టార్గెట్ అవుతున్నారు.

మాధవ్ చేసినదాంట్లో తప్పేంటి..?

మాధవ్ ని వెనకేసుకొచ్చే విషయంలో వైసీపీ నేతలు ఆయన చేసినదాంట్లో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు విచారణ జరగాలి కదా అన్నారు, జరిగితేనే నిజానిజాలు తెలుస్తాయన్నారు. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ అది నాలుగు గోడల మధ్య జరిగిన ప్రైవేట్ వ్యవహారం అంటున్నారు. అసలు ఫిర్యాదే లేదంటున్నారు. ఆయన అలా ప్రవర్తించారంటే, అవతల వ్యక్తి ఎంతలా రెచ్చగొట్టి ఉంటారో అంచనా వేయొచ్చు అంటున్నారు, ఆ అవతలి వ్యక్తి టీడీపీ ప్రేరేపిత బ్లాక్ మెయిలర్ అనే కొత్త లాజిక్ తీస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండానే వారు మాధవ్ తప్పుని ఒప్పుకున్నట్టు అవుతోంది.

మంత్రులు రోజా, నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. తాజాగా హోం మంత్రి తానేటి వనిత కూడా మాధవ్ వ్యవహారంపై స్పందించారు. ఇక్కడ విచారణ ఆలస్యం కావడాన్ని వారు సమర్థించుకోవడం వింత, విశేషం, విడ్డూరం అంటున్నారు టీడీపీ నేతలు. గతంలో చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చిన కేసు కూడా ఇంకా తేలలేదని, ఇప్పుడీ కేసు విషయంలో ఎందుకంత తొందర అంటున్నారు. నిజాలు నిదానంగా నిగ్గుతేలతాయంటున్నారు. అయితే చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఈ విషయంలో యమా స్పీడ్ గా ఉన్నారు. విచారణ ఇంత లేటా అని ప్రశ్నిస్తున్నారు, పార్టీనుంచి సస్పెండ్ చేయండి, అసలు పార్లమెంట్ నుంచే సస్పెండ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు.

మాధవ్ కి మద్దతుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నా.. సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. మీడియా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తడబడుతూనే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక కామెంట్లు పెడితే నిముషాల వ్యవధిలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టి మూలాలు కనిపెడుతున్నారని, ఈ వీడియో విషయంలో మాత్రం వారి స్పీడ్ ఏమైపోయిందనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. వీడియో మూలం ఎక్కడుందో, అసలు అది నిజమేనా, లేక మార్ఫింగా కనిపెట్టలేకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. మొత్తమ్మీద ఈ వీడియో వ్యవహారంలో ప్రతిపక్షాల ట్రాప్ లో పడిపోయింది వైసీపీ. నిన్న మొన్నటి వరకూ ఇది కేవలం మాధవ్ కి అంటిన బురద అనుకున్నా, ఇప్పుడు దాన్ని అందరూ తలాకాస్త పూసుకుంటున్నారు.

First Published:  10 Aug 2022 3:03 AM GMT
Next Story