Telugu Global
Andhra Pradesh

ప్రజాభీష్టం మేరకే మూడు రాజధానుల నిర్ణయం.. - వైవీ సుబ్బా రెడ్డి

వెనకబడిన ఉత్తరాంధ్రకు మద్ధతుగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలన్న జేఏసీ నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ గౌరవిస్తోందన్నారు. తాము అమరావతి అభివృద్ధికి అడ్డుపడట్లేదంటూ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడారు.

ప్రజాభీష్టం మేరకే మూడు రాజధానుల నిర్ణయం.. - వైవీ సుబ్బా రెడ్డి
X

రాష్ట్ర‌ అభివృద్ధిలో మూడు రాజధానుల పాత్ర ఎంతో కీలకంగా ఉండనుంది. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అందులో భాగంగానే మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలు లేకుండా చూడాలన్న సీఎం జగన్ దూరదృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా మారింది.. అని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్ఢినేటర్ వైవీ సుబ్బా రెడ్డి పేర్కొన్నారు.

వెనకబడిన ఉత్తరాంధ్రకు మద్ధతుగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలన్న జేఏసీ నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ గౌరవిస్తోందన్నారు. తాము అమరావతి అభివృద్ధికి అడ్డుపడట్లేదంటూ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర జేఏసీ తలపెట్టిన విశాఖ గర్జన సభకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగని అమరావతికీ తామేమీ అన్యాయం చేయడం లేదని, అక్కడ శాసన రాజధానిని ఏర్పాటు చేస్తున్నామని తేల్చి చెప్పారు.

పాలనా వికేంద్రీకరణలో భాగంగా సీఎం జగన్మోహన్​ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని, అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ ఆయన చాలాసార్లు చెప్పారని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. న్యాయ రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలును అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన నగరమని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రముఖ నగరంగా విశాఖ ప్రసిద్ధి చెందిందని అన్నారు. విశాఖపట్నంలో రాజధానిని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ పాదయాత్ర చేస్తున్న వారికి నిరసన తెలియజేసేందుకే ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన విశాఖ గర్జన సభకు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రజలేమీ అడ్డుపడడం లేదని, అలాంటప్పుడు పాదయాత్ర చేస్తున్నవాళ్లు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎందుకు మోకాలడ్డుతున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ సిద్ధాంతం పాలనా వికేంద్రీకరణే కాబట్టి.. ఉత్తరాంధ్ర జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. వైఎస్సార్​సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై 'విశాఖ గర్జన'ను విజయవంతం చేయాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

First Published:  14 Oct 2022 9:40 AM GMT
Next Story