Telugu Global
Andhra Pradesh

అనర్హత వేటు వేయాలా? ఎలా వేస్తారు?

అనర్హత వేటు వేయాలా? ఎలా వేస్తారు?
X

మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భలే డిమాండ్ చేశారు. అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీ సత్తా ఏమిటో తెలిసిపోతుందని ఎంపీ చాలెంజ్ చేశారు. అంటే రఘురామ‌రాజు తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఆలోచనలో లేరని అర్థ‌మైపోతోంది. అధికారికంగా ఆ ఏడుగురు పార్టీ మారలేదని అందరికీ తెలిసిందే.

పార్టీ మారనపుడు వాళ్ళపై అనర్హత వేటు ఎలా వేయగలరో ఎంపీయే చెప్పాలి. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల‌లో ముగ్గురు చంద్రబాబునాయుడుతో విభేదించారు. తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. అంతేకానీ వాళ్ళేమీ వైసీపీ కండువా కప్పుకోలేదు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో నలుగురు ఎమ్మెల్యేలు విభేదించి పార్టీకి దూరమయ్యారు. వీళ్ళు కూడా అనర్హత వేటుకు భయపడే టీడీపీ కండువా కప్పుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో భేటీ అవుతున్నారు.

అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళతో సమావేశమవుతునే ఉన్నారు. ఎన్నిసార్లు భేటీలైనా అధికారికంగా టీడీపీలో అయితే చేరలేదు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు, టీడీపీ కండువ కప్పుకోనప్పుడు ఇక అనర్హత వేటు ఎలా సాధ్యం? పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేఏగా కొనసాగాలని అనుకున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఎవరిపైనా అనర్హత వేటుపడే అవకాశంలేదు. ఒకవేళ వాళ్ళంతట వాళ్ళుగా రాజీనామాలు చేస్తే అప్పుడు ఉపఎన్నికల గురించి ఆలోచించవచ్చు.

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న ర‌ఘురామ‌రాజు తన ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయటంలేదు? ఒకరికి బుద్ధులు చెప్పేటప్పుడు ముందు తాను ఆచరించాలన్న ఇంగితం ఆ ఎంపీకి లేదా? గెలుపుపై నమ్మకంలేకే కదా మూడేళ్ళుగా రాజీనామా చేయకుండా ఢిల్లీలో కూర్చుని నోటికొచ్చింది మాట్లాడుతున్నది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల‌కు కూడా గెలుపుపై నమ్మకం లేనట్లుంది. అందుకనే పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే కానీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలని అనుకోవటంలేదు. కాబట్టి తాను రాజీనామా చేయటంతో పాటు మిగిలిన నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల గురించి మాట్లాడితే బాగుంటుందేమో.

First Published:  11 Jun 2023 5:41 AM GMT
Next Story