Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డి రూటు మార్చారా?

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రూటు మార్చి జనసేనలో చేరే అవకాశముందని టాక్ మొదలైంది.టీడీపీ-జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమే. అందుకనే జనసేనలో చేరి పొత్తుల్లో జనసేన తరపున నెల్లూరు రూరల్లో పోటీ చేయటానికి కోటంరెడ్డి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

కోటంరెడ్డి రూటు మార్చారా?
X

నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రూటు మార్చారా? ఇప్పుడు ఇదే అనుమానం పెరిగిపోతోంది. తూర్పుగోదావరిలో కోటంరెడ్డి పర్యటించారు. రాజమండ్రిలో అరెస్టయిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని అడిగితే సమాధానం చెప్పలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం మాత్రం ఖాయమన్నారు. ఈ నెలాఖరులో రాజమండ్రిలో జరగబోతున్న టీడీపీ మహానాడులో తాను పాల్గొనటంలేదని స్పష్టం చేశారు. టీడీపీ మహానాడులో పాల్గొనక, టీడీపీలో ఎప్పుడుచేరుతారనే విషయానికి సమాధానం చెప్పకపోవటంతోనే అందరిలో అనుమానం పెరిగిపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కోటంరెడ్డిని టీడీపీలోకి చేర్చుకునే విషయంలో పార్టీలో బాగా వ్యతిరేకత ఉంది. అందుకనే తాను చేరకుండా ముందు తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధరరెడ్డిని చేర్పించింది. అయినా తమ్ముళ్ళల్లో మంట చల్లారలేదు. పార్టీలో జరిగే కార్యక్రమాలకు గిరిధర్‌ను పిలవటంలేదట. నేతల్లోని కోపాన్ని అర్థంచేసుకున్న గిరిధర్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారని సమాచారం. మరీ పరిస్థితుల్లో ఏంచేయాలి అనేది అన్నదమ్ములకు పెద్ద సమస్యగా మారింది.

అందుకనే మధ్యేమార్గంగా కోటంరెడ్డి రూటు మార్చి జనసేనలో చేరే అవకాశముందని పార్టీలో టాక్ మొదలైంది. టీడీపీ-జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమే. అందుకనే జనసేనలో చేరి పొత్తుల్లో జనసేన తరపున నెల్లూరు రూరల్లో పోటీ చేయటానికి కోటంరెడ్డి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. పొత్తులో సీటును జనసేనకు వదులుకుంటే తమ్ముళ్ళు చేసేదేమీ ఉండదనేది చంద్రబాబు ఆలోచనట. తమ్ముళ్ళ అభ్యంతరాలతో సంబంధం లేకుండా కోటంరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డిపై కోటంరెడ్డి తిరుగుబాటు మొదలుపెట్టారు. అయితే కోటంరెడ్డిని చేర్చుకునే విషయంలో పార్టీలో వ్యతిరేకత మొదలవుతుందని చంద్రబాబు ఊహించలేదట.

తాను టికెట్ ఇచ్చినా పనిచేయాల్సింది స్థానిక నేతలే. కాబట్టి వాళ్ళు పనిచేయకపోతే కోటంరెడ్డి గెలుపు సాధ్యంకాదు. అందుకనే జనసేనలో చేరి పొత్తులో నియోజకవర్గాన్ని తీసుకుని పోటీ చేయాలని కోటంరెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తమ్ముళ్ళు గ్రహించలేరని కోటంరెడ్డి, చంద్రబాబు అనుకుంటున్నారా? అన్నదే సందేహం. బాగా మంటమీదున్న తమ్ముళ్ళు కోటంరెడ్డిని ఓడించాలని అనుకుంటే టీడీపీ అయితే ఏమిటి? జనసేన అయితే ఏమిటి?

First Published:  5 May 2023 6:06 AM GMT
Next Story