Telugu Global
Andhra Pradesh

ఏపీలో ప్రతిపక్షానికి శ్రమ తప్పిందా..?

ఇక తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు, మాజీ మంత్రులు ఉన్నప్పటికీ.. వాళ్లెవరూ పెద్దగా ప్రజా ఉద్యమాలు చేయలేదు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయలేదు.

ఏపీలో ప్రతిపక్షానికి శ్రమ తప్పిందా..?
X

గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 151 స్థానాల్లో గెలుపొంది సత్తా చాటింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలతో ప్రతిపక్షానికే పరిమితమైంది. అయితే మొదటి నుంచి టీడీపీలోని ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు తప్ప.. ఎవరూ పెద్దగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టలేదు. వెరసి రాష్ట్రంలో ప్రతిపక్షగళం బలహీనంగా మారింది. అయితే కొన్ని మీడియా సంస్థలు నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో ఆ లోటు భర్తీ అయ్యింది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి గెలుపొంది.. ఆ పార్టీకి రెబల్ గా మారిన రఘురామ కృష్ణరాజు ప్రతిపక్షంగా మారారు. అసలైన ప్రతిపక్షం పాత్ర పోషించారు. ప్రభుత్వ పెద్దలకు ఊపిరాడకుండా నిత్యం విమర్శలతో విరుచుకుపడేవారు.

ఇక తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు, మాజీ మంత్రులు ఉన్నప్పటికీ.. వాళ్లెవరూ పెద్దగా ప్రజా ఉద్యమాలు చేయలేదు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయలేదు. అధినేత చంద్రబాబే ఆ బాధ్యత ఎక్కువగా చూసుకొనేవారు. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ వంటి కొంతమంది నేతలు మాత్రమే ఎక్కువగా మీడియాలో కనిపించేవారు.

అయితే ఇప్పుడు టీడీపీ వాళ్లకు వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రమ తగ్గించారు. నిత్యం వైసీపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీకి తలనొప్పిగా మారారు. మరోవైపు ఇటీవల సస్పెండ్ గురైన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక వీరికి ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి కూడా తోడైతే రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేని పరిస్థితి వస్తుందేమో..

మరోవైపు ఇటీవల మేకపాటి చేసిన కొన్ని విమర్శలు సంచలనంగా మారాయి. తనతోపాటు వైసీపీలో మరో 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ పట్ల కోపంగా ఉన్నారని ఆయన చెప్పారు. అంత సంఖ్యలో కాకపోయినా అసంతృప్తులు ఉండే అవకాశం ఉంది. మరి ఎన్నికల లోపు.. వారంతా ఒక్కొక్కరుగా బయటపడితే వైసీపీకి అది గడ్డుకాలం అని చెప్పకతప్పదు. మరి ఇటువంటి పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొంటారు? అన్నది వేచి చూడాలి. ఆయనకు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ కంటే.. సొంత పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలతో సమస్య ఎక్కువైంది.

First Published:  25 March 2023 1:51 PM GMT
Next Story