Telugu Global
Andhra Pradesh

రంగంలోకి వైసీపీ కొత్త సైన్యం

ఇప్పటికే గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం పేరుతో దాదాపు ఏడాదికాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు జనాల్లోనే తిరిగేట్లుగా చేశారు. అది అయిపోయిన తర్వాత సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలను మొదలుపెట్టారు.

రంగంలోకి వైసీపీ కొత్త సైన్యం
X

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నికలు దగ్గర ప‌డుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ గెలుపే టార్గెట్ గా పావులు కదుపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా 175కి 175 సీట్లూ గెలవాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన ఏకమయ్యాయి. దాంతో రెండువైపులా ఎవరి వ్యూహాలకు వాళ్ళు పదును పెడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండుపార్టీల సమన్వయ కమిటిలు క్షేత్రస్థాయిలో ఆందోళనలు, వ్యతిరేక ప్రచారం చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో జగన్ కూడా అనేక మార్గాల్లో ప్రజల్లోకి వెళుతున్నారు.

ఇందులో భాగంగానే జనాలను ఆకట్టుకోవటానికి కొత్తగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈనెల 10వ తేదీ నుంచి 23వ తేదీవరకు అన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నవరత్నాలపై పాజిటివ్ ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో నవరత్నాల ద్వారా చేసిన మంచిని, లబ్దిదారుల వివరాలను సచివాలయాల్లో డిస్ ప్లే చేశారు. వాలంటీర్లు, గృహసారథులు సుమారు 4 లక్షల మంది ప్రతి ఇంటికి వెళ్ళి నవరత్నాలపై పాజిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. వై ఏసీ నీడ్స్ జగన్ అన్న నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటంలో భాగంగానే ఈ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం పేరుతో దాదాపు ఏడాదికాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు జనాల్లోనే తిరిగేట్లుగా చేశారు. అది అయిపోయిన తర్వాత సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలను మొదలుపెట్టారు. అక్టోబర్‌లో మొదలైన ఈ యాత్ర డిసెంబర్ వరకు జరుగుతుంది. ఈ యాత్ర జరుగుతుండగానే నవరత్నాలపై సచివాలయాల ద్వారా కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. వాలంటీర్లు, గృహసారథులు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ద్వారా కుటుంబాలకు అందిన లబ్దిని ప్రజలకు గుర్తుచేస్తున్నారు.

జగన్ వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులకు పని బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఒకప్పుడు ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ ఎన్నికలవరకు చాలామంది ప్రజా ప్రతినిధులు జనాల్లోకి వెళ్ళే వారు కాదు. వివిధ అవసరాల కోసం జనాలే మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతుండేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే అవసరం చాలావరకు జనాలకు తప్పించారు. పథకాల లబ్దిమొత్తం ప్రభుత్వం నుంచి డైరెక్టుగా లబ్దిదారులకే అందుతోంది. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధులనే జనాల్లో తిరిగేట్లుగా జగన్ ప్రోగ్రాంలు రూపొందించారు. మరీ కష్టం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

First Published:  14 Nov 2023 5:20 AM GMT
Next Story